వరద నీళ్లే లేనప్పుడు కమిటీ ఎందుకు?

 వరద నీళ్లే లేనప్పుడు కమిటీ ఎందుకు?
  • మన నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించిండు
  • తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిండు
  • బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోకపోతే ఉద్యమిస్తం
  • బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటరా?
  • 9వ షెడ్యూల్​లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు: గోదావరిలో వరద జలాలే లేనప్పుడు.. రెండు రాష్ట్రాల అధికారులు, నిపుణులతో కమిటీ ఎందుకు వేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డిని బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘గోదావరి, కృష్ణా నదులు సింహభాగం తెలంగాణలో ప్రవహిస్తున్నాయి.. తెలంగాణ వాటా నీళ్లు వాడుకోకుండానే కిందికి పట్టుకుపోతానంటే ఎలా? కృష్ణా, గోదావరి నదుల్లో నికర, మిగులు జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం తేల్చాలి” అని డిమాండ్​ చేశారు. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై గురువారం సిరిసిల్లలో కార్యకర్తలతో కేటీఆర్​ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు సీఎం రేవంత్​రెడ్డి కోవర్టుగా మారారని, ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించుకుంటున్నారని విమర్శించారు. ‘‘ఢిల్లీలో బనకచర్ల మీద చర్చ పెడితే తాను వెళ్లనంటూ మీడియాకు రేవంత్​రెడ్డి లీకులు ఇచ్చిండు.. 24 గంటల్లో ఏం జరిగిందో ఏమో.. బనకచర్ల ఏకైక ఎజెండాగా చర్చపెడితే వెళ్లి కమిటీ వేసేందుకు ఒప్పుకున్నడు. ఈ కమిటీలు ఎందుకు? ఎవరిని అడిగి కమిటీ వేస్తున్నరు? 30 రోజుల్లో కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అవుతుందా?’’ అని కేటీఆర్​ ప్రశ్నించారు.

 ‘‘రేవంత్ రెడ్డికి చంద్రబాబు అంటే ఇష్టముంటే  ఆయన ఇల్లు అమ్మి విగ్రహం పెట్టుకోవాలి గానీ తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా ధారాదత్తం చేస్తామంటే చూస్తూ  ఊరుకోం. ఢిల్లీలో జరిగిన మీటింగ్ అపెక్స్ కమిటీ మీటింగ్ కాదు. ఇన్ ఫార్మల్ మీటింగ్ మాత్రమే. దానికి చట్టబద్ధత ఎక్కడుంది?” అని నిలదీశారు. కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుకుపోతున్నా సీఎం చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోకపోతే  మరోసారి ఉద్యమానికి బీఆర్​ఎస్  సిద్ధమవుతుందన్నారు. ‘‘ఎలాంటి అనుమతులు లేకుండా బనకచర్ల కట్టాలని ఏపీ చూస్తున్నది. రాయలసీమ, ఆంధ్రా రైతాంగానికి మేం వ్యతిరేకం కాదు.. కానీ తెలంగాణ హక్కు వాటా తేల్చకుండా నీళ్లుఎత్తుకుపోతామంటే చూస్తూ ఊరుకోం” అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వానలు రాక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారని, కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే కరువు అనేదే ఉండదని అన్నారు. 

ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటరా?

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్​ దుయ్యబట్టారు.  ‘‘42శాతం బీసీ రిజర్వేషేన్ చేయాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్​లో  చేర్చి చట్టబద్దత కల్పించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామన్నరు. బీసీ ల కోసం ప్రతి ఏడాది 20వేల కోట్లు కేటాయిస్తామన్నరు. ఐదేండ్లలో లక్ష కోట్లు పెడతామన్నరు. బీసీలకు 42శాతం వాటా  ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కల్పిస్తామన్నరు. బీసీల కోసం ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నరు. బీసీ సబ్ ప్లాన్ పెడ్తామన్నరు. కానీ ఇవేవి చేయకుండా ప్రజలను మభ్యపెడ్తున్నరు” అని ఆయన విమర్శించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటనే ప్రభుత్వం జంకుతున్నదని ఆరోపించారు. తెలంగాణలో 269 జెడ్పీటీసీ స్థానాల్లో బీఆర్​ఎస్  గెలుస్తుందని బీఆర్ఎస్​ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన అన్నారు.