మన కాలేజీలు అంత గొప్పగా ఏంలేవు: కేటీఆర్

మన కాలేజీలు అంత గొప్పగా ఏంలేవు: కేటీఆర్
  • చదువుల కోసం పిల్లలు అమెరికా ఎందుకు పోవాలి?: కేటీఆర్​
  •     ఇక్కడే ప్రపంచస్థాయి కాలేజీలను ఏర్పాటు చేయాలి
  •     వనరులు పుష్కలం.. నాయకత్వ లోపంతోనే సమస్య
  •     కులం, మతం పిచ్చితో వెనకబడుతున్నామని వ్యాఖ్య
  •     తెలంగాణభవన్​లో ఇండిపెండెన్స్​డే వేడుకల్లో కామెంట్స్​

హైదరాబాద్, వెలుగు: అమెరికాతో పోలిస్తే మన దేశంలోని కాలేజీలు ఏమంత గొప్పగా లేవని.. తన కూతురు ఇదే విషయం చెబుతున్నదని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ​అన్నారు. ‘పిల్లలంతా చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. మన పిల్లలు చదువుల కోసం అమెరికాకు ఎందుకు వెళ్లాలి. ఇక్కడే ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు దేశంలో ఉన్నా.. అవకాశాల కోసం యువత విదేశాలకు వెళ్తూనే ఉన్నారన్నారు. ప్రపంచస్థాయి విద్య, ఉపాధి, పరిశోధన, వ్యాపార అవకాశాలు కల్పించి మన దేశ ప్రతిభ బయటకు వెళ్లే పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. దేశంలో కొరవడింది వనరులు కాదని.. నాయకత్వ లోపం ఉందని చెప్పారు. శనివారం తెలంగాణభవన్​లో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను కేటీఆర్​ ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీని గొప్పగా గౌరవిస్తుంటే.. దేశంలో కొందరు మాత్రం ఆయన్ను అవమానించేలా, ఆయనను హత్య చేసిన వారిని కీర్తిస్తున్నారన్నారు. కాగా, తమ హక్కులు, గౌరవం కోసం ధైర్యంగా నిలబడిన నల్సార్​ విద్యార్థులకు తాను సెల్యూట్​ చేస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థుల గొంతుకకు, వారి హక్కులకు, న్యాయం కోసం వారు చేసే పోరాటానికి తగిన గౌరవం ఉండాలని అన్నారు.

ప్రజలకు కనీస సౌలతులు కల్పించడమే నిజమైన దేశభక్తి

దేశ స్వాతంత్ర్య పోరాటంలో నేటి కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా పాత్ర లేదని కేటీఆర్​అన్నారు. అయినా వాళ్లు ఇతరులకు దేశభక్తి గురించి పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. ‘దేశభక్తి అంటే ప్రజలను విడదీయడం కాదు. దేశాన్ని బలోపేతం చేసి.. ప్రజలకు కనీస అవసరాలు కల్పించి.. యువతకు అవకాశాలు అందించి.. రైతులకు భరోసా కల్పించి.. దేశంలోని ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే నిజమైన దేశభక్తి’ అని అన్నారు. మతం, కులం పేరుతో ప్రజలను విడదీసే రాజకీయాలు చేయడం వల్ల దేశం వెనుకబడుతోందని విమర్శించారు. మన దేశంలో సహజ, మానవ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ దేశాన్ని ముందుకు నడిపించే స్పష్టమైన నాయకత్వం, దీర్ఘకాలిక ప్రణాళిక, చిత్తశుద్ధి లోపించాయని విమర్శించారు.  

28 ఇంజన్లూ పరుగెత్తాలి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ‘డబుల్‌‌ ఇంజన్‌‌’ నినాదాన్ని కేటీఆర్‌‌ తప్పుబట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్న వాదన సరికాదన్నారు. ‘‘దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 ఇంజన్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు బలంగా పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు సాగుతుంది. ఒక్క డబుల్‌‌ ఇంజన్‌‌తో దేశం అభివృద్ధి చెందదు’’ అని అన్నారు. ఇక, సీఎం రేవంత్​ 18 గంటలు పనిచేస్తున్నానని చెబుతున్నారని, ఆ సమయాన్నంతా సీఎం అన్నదమ్ములకు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికే వాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల గురించి సీఎంకు పట్టింపు లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తుందన్నారు. రాబోయే రెండేండ్లు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే బహిరంగంగా ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు చేయడం సాధారణ విషయం కాదని, ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతున్నదని పేర్కొన్నారు.