ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్‌‌ విధానం తేవాలి ..ఈసీకి కేటీఆర్ విజ్ఞప్తి

ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్‌‌ విధానం తేవాలి ..ఈసీకి కేటీఆర్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: దేశ ఎన్నికల వ్యవస్థలో మళ్లీ బ్యాలెట్‌‌ పేపర్‌‌ విధానం తీసుకురావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అమెరికా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలను పక్కనపెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ వైపు మళ్లాయని పేర్కొన్నారు. 

మంగళవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌‌లో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌‌ జ్ఞానేశ్‌‌ కుమార్‌‌‌‌తో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈవీఎంలపై దేశ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిపై ప్రజలు విశ్వసనీయతను కోల్పోతున్న నేపథ్యంలో మళ్లీ బ్యాలెట్‌‌ విధానం తీసుకురావాలని, ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో జరిగే బిహార్‌‌ అసెంబ్లీ ఎన్నికలతోనే దీన్ని తిరిగి ప్రారంభించాలని ఈసీని కోరాం” అని తెలిపారు. 

రాజకీయ పార్టీలు ఎన్నికల టైమ్‌‌లో అడ్డగోలు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోతే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు. ‘‘రిజర్వేషన్ల పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తున్నది.

 42 శాతం రిజర్లేషన్లు అంటూ సీఎం ఢిల్లీకి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు. ముందు ప్రభుత్వం తమ చేతుల్లో ఉన్న విద్య, ఉపాధి, కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కమిషన్‌‌ నివేదిక అంతా ట్రాష్, గ్యాస్‌‌ అని వ్యాఖ్యానించారు. 655 పేజీల నివేదికలో కేవలం 60 పేజీలే బయటపెట్టారని మండిపడ్డారు.