ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్.. ప్రభుత్వానికి కేటీఆర్ రిక్వెస్ట్

 ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్.. ప్రభుత్వానికి కేటీఆర్ రిక్వెస్ట్

ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ టెస్లా.. ఇండియాలో 2 బిలియన్ డాలర్ల నుండి 3 బిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.  ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు అమెరికా నుంచి టెస్లా బృందం త్వరలో ఇండియాకు రానుంది. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. టెస్లా కంపెనీని తెలంగాణకు తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. టెస్లా ప్రతినిధులను మన రాష్ట్రానికి తీసుకొచ్చి.. ఇక్కడ కార్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. టెస్లా బృందం హైదరాబాద్‌ను సందర్శించి, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలను తప్పకుండా అర్థం చేసుకుంటుందని కేటీఆర్ తెలిపారు.

Also Read :తెలంగాణలో 11 వేల కార్పోరేట్ ప్రైవేట్ స్కూల్స్.. ఫీజుల దంచుడుతో పేరెంట్స్ బెంబేలు

ఈ నెలలో భారత్ కు రానున్న టెస్లా బృంద..ప్రధానంగా ఆటోమోటివ్ హబ్‌లను కలిగినటువంటి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలను ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది.. హర్యానా, న్యూఢిల్లీలోనూ ఈ బృందం పర్యటించనున్నట్లు సమాచారం. పోర్ట్ సౌకర్యాలు కలిగిన రాష్ట్రాలపై టెస్లా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పోర్ట్ సౌకర్యం ఉంటే కార్ల ఎగుమతి మరింత సులభతరం అవుతుంది.. మొదట, ఈ రాష్ట్రాలలో కార్ల ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా మొగ్గు చూపే అవకాశం ఉంది.