కేన్స్ కంపెనీని గుజరాత్‌కు తరలిపోనివ్వొద్దు: కేటీఆర్​

కేన్స్ కంపెనీని గుజరాత్‌కు తరలిపోనివ్వొద్దు: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: సెమీ కండక్టర్ రంగంలో కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సెమికాన్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్ కి తరలిపోతున్నట్లు వచ్చిన వార్తలపైన బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కంపెనీ గతంలో కర్నాటక రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించామన్నారు. కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ పరిశ్రమకు దగ్గరగా భూమి కేటాయింపు కావాలంటే, కేవలం పది రోజులలోపే అవసరమైన భూమిని కేటాయించినట్లు కేటీఆర్ తెలిపారు.  ఇప్పుడు ఇదే కంపెనీ గుజరాత్‌కు తమ పెట్టుబడులను తరలిస్తున్నట్లు వచ్చిన వార్తలపైన కేటీఆర్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు.

‘‘ఈ కంపెనీ.. ఓసాట్‌ యూనిట్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంతో పాటు, సెమీ కండక్టర్ పరిశ్రమ ఈకో సిస్టమ్ కి అత్యంత కీలకమైనదని,  ఈ పరిశ్రమ వస్తే ఈ రెండు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుంది’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. వెంటనే కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టుబడులను కొనసాగించేలా ఒప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.