కేసీఆర్ పుట్టకుంటే..తెలంగాణ ఉద్యమమే లేదు

కేసీఆర్ పుట్టకుంటే..తెలంగాణ ఉద్యమమే లేదు
  • సిద్దిపేట ఓ నాయకుడిని ఇవ్వడమేకాదు.. తెలంగాణకూ జన్మనిచ్చింది: కేటీఆర్
  • ప్రపంచంలో ఎక్కడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం సాధ్యంకాదు
  • ప్రైవేటు రంగంలో మంచి అవకాశాలు దొరికేలా ప్రయత్నిస్తున్నమని ప్రకటన
  • కేసీఆర్‌‌‌‌ను తిట్టిన నోళ్లే ప్రశంసిస్తున్నయ్​: హరీశ్
  • సిద్దిపేటలో ఐటీ టవర్‌‌‌‌ ప్రారంభం

సిద్దిపేట, వెలుగు:  సిద్దిపేటలో కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం ఉండేది కాదని, ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘సిద్దిపేట మీద ప్రేమ ఎందుకని కొందరు మిత్రులు ఆడుగుతుంటరు. సిద్దిపేట ఒక నాయకుడిని ఇవ్వడమేకాదు.. తెలంగాణకు జన్మనిచ్చింది. ఇక్కడ కేసీఆర్ పుట్టక పోతే, ఆ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూర్చోబెట్టక పోతే టీఆర్ఎస్ పార్టీ లేదు.. 

తెలంగాణ ఉద్యమం లేదు.. రాష్ట్రం లేదు.. సిద్దిపేటకు చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని సీఎం కేసీఆర్ చెప్పే మాట గుండె లోతుల్లోంచి వచ్చిందే తప్ప నాలిక చివరి నుంచి వచ్చింది కాదు’ అని ఆయన చెప్పారు. గురువారం సిద్దిపేటలో రూ.63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి కేటీఆర్ ప్రారం భించారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రగతి అవార్డులను సాధిస్తూ అభివృద్ధిలో దేశానికే మోడల్‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ నిలిచిందన్నారు. 

రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్లను త్వరగా పూర్తి చేస్తం

2014లో తెలంగాణ నుంచి రూ.56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు జరగ్గా.. ఈ ఏడాది రూ.2.41 లక్షల కోట్లకు చేరడం అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. యువత ఉపాధికి కొదవలేదని, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, యువత తమ టాలెంట్​తో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘‘తెలంగాణలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. దేశంలో 140 కోట్ల జనాభాకు రైల్వేలు, సాయుధ బలగాలు, మిగతా అన్ని రంగాల్లో  కేంద్రం కల్పిస్తున్న ఉద్యోగాలు 59 లక్షలు మాత్రమే. ఇది జనాభాలో 0.5 శాతమే. తెలంగాణలో 6.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. 

కానీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీలైనంత త్వరగా రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్లను పూర్తి చేస్తాం. మిగిలిన వారికి ప్రైవేటు రంగంలో మంచి అవకాశాలు దొరికేలా ప్రయత్నిస్తున్నాం” అని వివరించారు. ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌ని ఇంకా విస్తరిస్తామని, టాస్క్‌‌‌‌‌‌‌‌తో యువతకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

సిద్దిపేటకు మరికొన్ని పరిశ్రమలు: హరీశ్

తెలంగాణ వస్తే ఇక్కడ ఏమీ ఉండదంటూ తిట్టిన నోళ్లే ఇప్పుడు కేసీఆర్ పనులను చూసి మెచ్చుకుంటున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటకు ఐటీ టవర్ వస్తుందని కలలో కూడా అనుకోలేదని, సిద్దిపేట జిల్లా కావడానికి, ఐటీ టవర్ రావడానికి తెలంగాణ సాధించిన కేసీఆరే కారణమన్నారు. కేటీఆర్ సహకారంతో రాబోయే రోజుల్లో మరికొన్ని పరిశ్రమలు సిద్దిపేటకు తెస్తానని హామీ ఇచ్చారు. 30 ఏండ్ల క్రితమే సీఎం కేసీఆర్ సిద్దిపేట అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తే దాన్ని విస్తృతం చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. సిద్దిపేట యువతకు ఉద్యోగ కల్పన చేయాలన్న కల ఐటీ టవర్ తో తీరిందన్నారు.

అసూయపడేలా సిద్దిపేటను హరీశ్ అభివృద్ధి చేస్తుండు

దేశానికి తెలంగాణ మోడల్ అయితే రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచిగా మారిందని కేటీఆర్​ అన్నారు. సిద్దిపేట అభివృద్ధిని కేసీఆర్ ప్రారంభిస్తే.. దాన్ని నాలుగింతలు చేసిన ఘనత హరీశ్ రావుకు దక్కుతుందన్నారు. ‘‘అన్ని నియోజకవర్గాలు సిద్దిపేటలా అభివృద్ధి చెందితే.. బంగారు తెలంగాణ, బంగారు భారత దేశం సాకారం అవుతుంది. దళిత బంధుకు, మిషన్ భగీరథకు సిద్దిపేట స్ఫూర్తినిచ్చింది. 

30 ఏండ్ల కింద కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత చైతన్య జ్యోతి అమలు చేశారు. మిషన్ భగీరథకు పునాది పడ్డది కూడా ఇక్కడే. కేంద్రం ప్రారంభించిన హర్ ఘర్​ జల్ స్కీమ్.. భగీరథకు కాపీ” అని చెప్పారు. సిద్దిపేటలో ఉన్నట్టు ప్రతి జిల్లాలో స్వచ్ఛ బడి ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పారు. అందరూ అసూయపడేలా సిద్దిపేటను హరీశ్ రావు అభివృద్ధి చేస్తున్నారని, రికార్డులు బద్దలయ్యేలా 1.50 లక్షల మెజారిటీతో హరీశ్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.