స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు..కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది: కేటీఆర్

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు..కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: యూరియా కొరత కారణంగా కాంగ్రెస్ లీడర్లకు గ్రామాల్లో తిరిగే ముఖం లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, వార్డు, బూత్ కమిటీ లీడర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల మానేరు మండుటెండల్లోనూ నిండుగా పారేది. కాంగ్రెస్ వచ్చాకే ఎడారిలా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కేసులు పెట్టడం.. జైలుకు పంపడం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ మేము ఒక్క పథకాన్ని ఆపలేదు. ఎన్నికల టైమ్​లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదు. కేసీఆర్ పాలనలో రూ.2 లక్షల కోట్లు అప్పు మాత్రమే చేసిందని పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ సర్కార్ మాత్రం రూ.8 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నది’’అని కేటీఆర్ అన్నారు. 

క్షేత్రస్థాయిలో పర్యటించాలి

బీఆర్ఎస్ నేతలంతా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సమస్యలపై పోరాటం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘పల్లెల్లో వీధి దీపాలు వెలగడం లేదు. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం పదేండ్ల పాటు అందరికీ మంచి చేసినం. ఎవరైనా మన జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్​కు మెజార్టీ సీట్లు రావాలి. దీని కోసం అందరూ కష్టపడి పని చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది. దానిపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం నేను పని చేస్తా’’అని కేటీఆర్ అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీనియర్ లీడర్లు తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.