మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు


ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మంత్రి కొండా సురేఖకు  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్  లీగల్ నోటీసులు పంపించారు. కొండా సురేఖతో పాటుగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మె్ల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల  కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిలకి లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్.  వీరితోపాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్ కి మరోసారి లీగల్ నోటీసులు పంపించారు.  

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా సరే వదిలిపెట్టేది లేదని..   చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే తేల్చిచెప్పారు. 

ఫోన్ ట్యాపింగ్  అంశంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని  కేటీఆర్ మండిపడ్డారు.  తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. 

మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదని  మంత్రి  కొండా సురేఖ ఇప్పటికే తేల్చి చెప్పారు.  తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నా సురేఖ..   లీగల్ నోటీసులు ఇచ్చినా ఎదుర్కొంటామని  అందుకు  సిద్దంగా ఉన్నామని  చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే విచారణలో తేలితే తప్పని సరిగా శిక్షకు అర్హులేనని చెప్పారు.  కేటీఆర్ భయంతో ఏదేదో దిగజారి మాట్లాడుతున్నారని సురేఖ మండిపడ్డారు.