కాళేశ్వరం గురించి మాట్లాడితే.. ఊరుకోం బిడ్డ .. రాహుల్​కు కేటీఆర్ హెచ్చరిక

కాళేశ్వరం గురించి మాట్లాడితే.. ఊరుకోం బిడ్డ .. రాహుల్​కు కేటీఆర్ హెచ్చరిక
  • రాష్ట్రానికి కాళేశ్వరం వరం.. దేశానికి కాంగ్రెస్ శనీశ్వరం
  • మేడిగడ్డ కూలిపోతదని తప్పుడు ప్రచారం చేస్తున్నరని మండిపాటు
  • బీఆర్ఎస్​లో చేరిన బీజేపీ నేత గడ్డం నాగరాజు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు వరమైతే, దేశానికి కాంగ్రెస్​పార్టీ శనీశ్వరమని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ అన్నారు. ‘‘తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఆలిండియా పప్పు రాహుల్ గాంధీ.. ఇద్దరూ గాలి మోటార్ల పోయి మేడిగడ్డ చూసిన్రు. ఇద్దరు మహా ఇంజనీర్లు. కేసీఆర్​లక్ష కోట్లు మింగిండు అని చెప్తున్నరు. బ్రిడ్జి ఎక్స్​పాన్షన్​జాయింట్​చూపించి మేడిగడ్డ కూలిపోతదని అంటున్నరు. అది వాళ్ల అవగాహన” అని మండిపడ్డారు. ‘కాళేశ్వరం తెలంగాణ జాతి సంపద.. దాని గురించి మాట్లాడితే ఊరుకోం బిడ్డ” అని రాహుల్ ను హెచ్చరించారు. కాళేశ్వరం ఫెయిల్ అయితే రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వడ్లు ఎట్ల పండుతున్నాయో, కాల్వల్లో పారుతున్న నీళ్లెక్కడివో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దుస్థితిపై కవులు పాటలు రాసిన్రు. మీ దిక్కు మాలిన పాలనలో నీళ్లు ఇచ్చి ఉంటే.. మా వాళ్లు బొంబాయికి, దుబాయికి వలస పోయేటళ్లు కాదు. నెహ్రూ పునాది రాయి వేసిన ఎస్సారెస్పీ పూర్తి కావడానికి 60 ఏండ్లు పట్టింది. మేం నాలుగేండ్ల రికార్డు టైమ్​లో కాళేశ్వరం పూర్తి చేసినం” అన్నారు. గురువారం తెలంగాణ భవన్​లో మానకొండూర్​బీజేపీ ఇన్​చార్జ్ గడ్డం నాగరాజు బీఆర్ఎస్​లో చేరారు. ఆయనకు కేటీఆర్​కండువా కప్పి మాట్లాడారు.

రాహుల్ కు చరిత్ర తెల్వదు..

జనాన్ని ఆగం చేసేందుకు కాంగ్రెస్ లోని కొందరు చిల్లర గాళ్లు ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘రాహుల్ గాంధీకి చరిత్ర తెల్వదు.. తెలుసుకునే సోయి లేదు. రాహుల్.. నువ్వు స్క్రిప్ట్ అన్న మార్చుకో లేదా స్క్రిప్ట్ రైటర్ నన్నా మార్చుకో. కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసింది. దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ మీ రేవంత్ రెడ్డి. దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు, బ్లాక్ మెయిలర్, ఓటుకు నోటు దొంగ. పార్టీ టికెట్లను అంగట్ల గొడ్లను అమ్మినట్టు అమ్ముకున్న రేవంత్ అలియాస్ రేటెంత రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ అవినీతి గురించి మాట్లాడడం దేశంలో అతిపెద్ద వింత. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్. ఆదర్శ్, బోఫోర్స్, కామన్ వెల్త్, స్పెక్ట్రం, బొగ్గు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో సహజ వనరులన్నీ దోచుకున్న దొంగలు మీరు. పంచభూతాలనూ మింగిన అవినీతి తిమింగలాలు మీరు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల కుంభమేళా’’ అని విమర్శించారు. కాంగ్రెసోళ్లు నీతి, నిజాయతీ గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారని అన్నారు.

రాహుల్.. నిన్ను రేవంత్ అమ్మేస్తడు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిందే రూ.80 వేల కోట్లు అయితే, రూ.లక్ష కోట్ల అవినీతి ఎట్ల జరుగుతుందో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘రాహుల్.. కాళేశ్వరం గురించి మీ పక్కన ఉన్న సన్నాసులు చెప్పిన సొల్లు కాకుండా అసలు విషయాలు తెలుసుకోండి. 2008లో రూ.40 వేల కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్లలో పంపుహౌస్​లు, కాల్వలు తప్ప రిజర్వాయర్లు లేవు. పైన నీళ్లు లేని తుమ్మిడిహెట్టి కాడ హెడ్​వర్క్స్​పెట్టిన్రు. కేసీఆర్​వచ్చినంక సీనియర్​ఇంజనీర్లతో చర్చించి నీటి లభ్యత ఎక్కువగా ఉన్న మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చారు. కొత్తగా అనేక రిజర్వాయర్​లు తలపెట్టాం. పదేండ్ల తర్వాత ప్రాజెక్టు అంచనాలు పెరగవా?’’ అని ప్రశ్నించారు. ‘‘నాగార్జునసాగర్ ను 20 కిలోమీటర్ల కింద కట్టి, ఎడమ కాలువ డిజైన్ మార్చి నల్గొండ, ఖమ్మం జిల్లాకు అన్యాయం చేసిన్రు. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో కూడా రాహుల్ గాంధీకి తెల్వదు.  కృష్ణా నదిలో తెలంగాణకు వాటా ఇచ్చిన్రా?’’ అని ప్రశ్నించారు. ‘రాహుల్.. నీకు రేవంత్ గురించి తెలియదు. నిన్ను కోఠిలో చారాణాకు అమ్మేస్తడు తెలుసుకో’ అని హెచ్చరించారు.

రెండు ఎన్నికల్లో ఓడినా.. కేసీఆర్ వెనక్కిపోలే

కేసీఆర్​మొదటిసారి సింగిల్​విండో ఎన్నికల్లో, రెండోసారి 1983లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయారని.. ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని రాజకీయాల్లో నిలదొక్కుకున్నారే తప్ప వెనక్కిపోలేదని కేటీఆర్​అన్నారు. 1985 నుంచి వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారని తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ సక్సెట్ మీట్ జరిగింది. ఇందులో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ స్కీమ్ లో భాగంగా 500 మంది ఎస్టీ యువత అద్భుత విజయాలు సాధించారని, ఇది గిరిజన తండాలు, ఆదివాసీ గూడేల్లోని యువతకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఎస్టీల కోసం స్పెషల్​ఇండస్ట్రియల్​పార్క్​ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు.