కేంద్రానికి సిగ్గుచేటు..నీట్‌‌ పేపర్ లీక్‌‌పై కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ 

కేంద్రానికి సిగ్గుచేటు..నీట్‌‌ పేపర్ లీక్‌‌పై కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ 
  • లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపాటు 

హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీక్‌‌తో పరీక్షను రద్దు చేయాల్సి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైందని ఆరోపించారు. 2024లో నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందన్నారు.

‘‘జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారింది. ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది. ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు మానసిక క్షోభకు గురిచేసింది. పేపర్‌‌‌‌ లీక్ ఘటనను సీరియస్‌‌గా తీసుకుని వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి. దీని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా.. కఠినంగా శిక్షించాలి. సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించాలి. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.