
- మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నడు: కేటీఆర్
- ఒకే అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్నడు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని, ఆయన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందుకే ఒకే అంశంపై ఆయన రోజుకోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్నవన్నీ తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులేనని అన్నారు. నిజాం కట్టిన చార్మినార్.. లేదంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను చూపిస్తున్నారే తప్ప.. కాంగ్రెస్ పార్టీ కట్టిన ఒక్క దానినైనా రేవంత్ చూపించగలరా? అని ప్రశ్నించారు. ‘‘ఒక రోజు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటారు. ఇంకో రోజు కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తామంటారు.
వాళ్ల ప్రభుత్వంలోని మంత్రులు రంగనాయకసాగర్ నుంచి నీళ్లకు జెండాలు ఊపుతున్నారు. ఒక రోజేమో అప్పు లేదంటారు. మరోరోజు అసెంబ్లీలో రూ.1.70 లక్షల కోట్ల అప్పు చేశామని చెబుతారు. ఒకరోజు కాకతీయ కళాతోరణం అధికారిక చిహ్నంగా వద్దంటారు. మరో రోజు మిస్‌వరల్డ్ బ్యూటీ కంటెస్టెంట్లకు దానినే చూపిస్తారు. ఓ రోజు కేసీఆర్ ఆనవాళ్లు తొలగిస్తామంటారు. ఇంకో రోజు కేసీఆర్ కట్టిన ప్రతి ప్రాజెక్టునూ తిప్పి చూపిస్తున్నారు’’ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ రెండు పిల్లర్లు కుంగితేనే ఇంత రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఏం చేసిందని మండిపడ్డారు. 3 నెలల తర్వాత కూడా అందులో చిక్కుకున్న వారిని బయటకు తీయలేకపోయారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాధాన్యత కోర్టే చెబుతుంది
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం సుప్రీంకోర్టు తీర్పు సాక్షిగా తేలిపోయిందని, కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలోనే తేలిపోతుందని కేటీఆర్అన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై నీచ, నికృష్టమైన రాజకీయం చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు చెప్పిన తీర్పే.. కాళేశ్వరం ప్రాజెక్టుపైనా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రజలు, మూర్ఖ కాంగ్రెస్ నాయకులకు అర్థమయ్యేలా కోర్టులే చెబుతాయి” అని వ్యాఖ్యానించారు.