వంద రోజుల్లో.. వంద తప్పులు చేసిన్రు: కేటీఆర్

వంద రోజుల్లో.. వంద తప్పులు చేసిన్రు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో వంద తప్పులు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాలుగు కోట్ల ప్రజలను ‘అబద్ధాల హస్తం’ నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. పదేండ్ల తర్వాత రైతులు తిప్పలు పడుతున్నారని ఆదివారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద ప్రశ్నలు సంధించారు. ‘‘చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజీపై ఎందుకు కుట్ర చేశారు? కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు? రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు? వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది? ప్రతి మహిళకు రూ.2,500 హామీ మరిచిపోయారా? మూడు నెలలైనా పెన్షన్లను రూ.4వేలకు ఎందుకు పెంచలేదు?’’అని ప్రశ్నించారు. ఒకటో తేదీన జీతాలు అందరికీ ఎందుకు అందడం లేదన్నారు. 

200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలని ప్రశ్నించారు. దళితబంధు పథకాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారని, అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారని మండిపడ్డారు. ఒకే ఒక్క రోజు ప్రజాభవన్‌‌‌‌కు వెళ్లి.. ఆ తర్వాత ఎందుకు ముఖం చాటేశారని ప్రశ్నించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లివ్వకపోవడం ఘోరం కాదా? అని నిలదీశారు. పదేండ్ల తర్వాత పచ్చని పంటలు ఎండిపోవడం మీరు చేసిన పాపం కాదా? అని ప్రశ్నించారు. వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే దుస్థితిని ఎందుకు కల్పించారని నిలదీశారు. నాణ్యతలేని కరెంట్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయని, దీనికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు.