
- కాంగ్రెస్‌ది అవినీతి పాలన: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అవినీతి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. 4 కోట్ల ప్రజల ముందు సీఎం అవినీతి బాగోతం బయటకు వచ్చిందన్నారు. సీఎం పేరు చార్జిషీట్లో రావడం రాష్ట్రానికే అవమానమని, దీనిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని శుక్రవారం ఓ ప్రకటనలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘‘పేదల జీవితాలతో చెలగాటమాడిన సీఎం రేవంత్ పాపం పండింది.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యంగ్ ఇండియా సంస్థకు విరాళాల కోసం వ్యాపారవేత్తలకు పదవుల ప్రలోభాలు చూపారని చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్నది. పార్టీ నేతలకు లంచాలిచ్చారని చెప్పింది. చట్టపరమైన ఆధారాలతో ఈడీ చేస్తున్న ఆరోపణలివి’’ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో వరుసగా స్కామ్‌లే చేస్తున్నదని ఆరోపించారు. ప్రతి నెలా ఒక కుంభకోణం బయటపడుతున్నదన్నారు. రేవంత్ అవినీతిపై తాము లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిపోయి.. బదులుగా డ్రామాలకు తెరలేపి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. రోజుకో కొత్త నాటకం.. కొత్త కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు. ప్రజాపాలన కాస్తా పర్సంటేజీల పాలనగా మారిందని ఆరోపించారు..