సిట్ పేరుతో సర్కార్ ఓవరాక్షన్ : కేటీఆర్

సిట్ పేరుతో సర్కార్ ఓవరాక్షన్ : కేటీఆర్
  •     మంత్రిపై వార్త వేసిన చానెల్​ను వదిలేసి.. వేరే చానెళ్లపై కేసులా?: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్​ప్రభుత్వం అటెన్షన్​ డైవర్షన్​ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కేటీఆర్ ​విమర్శించారు. అధికారపక్షానికి సన్నిహితంగా ఉండే టీవీ చానెల్​ఒక మంత్రిపై వేసిన కథనాన్ని కేవలం ఉటంకించినందుకు ఇతర చానెళ్లు, డిజిటల్​ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఏకంగా సిట్​ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. 

వార్త వేసిన అసలు చానెల్​ మీద చర్యలు తీసుకోకుండా సిట్​ పేరుతో కొత్త నాటకాలు ఎందుకని మండిపడ్డారు. ఎవరిని కాపాడేందుకు ఈ సిట్​ వేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఓవరాక్షన్​ను ప్రజలంతా గమనిస్తున్నారని, మీడియా సంస్థల మీద వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. నిజంగానే ప్రత్యేక దర్యాప్తు చేయాల్సి వస్తే కాంగ్రెస్​ పార్టీ అన్యాయాలు, అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేశారు. 

కాంగ్రెస్​ సర్కారులో జరుగుతున్న దారుణాలపై ఎందుకు సిట్​వేయడం లేదని నిలదీశారు. విచారణల పేరిట కమిషన్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ల ఏర్పాటు కేవలం కాలయాపనకేనని ఆయన విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే ఈ సిట్ గారడీలు చేస్తున్నారని, పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దాచిపెట్టేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.