కాంగ్రెస్ బాండ్ పేపర్లు.. నీటి మీద రాతలయినయ్ :  కేటీఆర్

కాంగ్రెస్ బాండ్ పేపర్లు.. నీటి మీద రాతలయినయ్ :  కేటీఆర్
  • జేమ్స్​ బాండ్​ లెక్క బాండ్​ పేపర్లు రాసిచ్చిన్రు 
  • బడ్జెట్​పై కేటీఆర్​ విమర్శలు
  • ఆరు గ్యారంటీల అమలుపై గన్​పార్క్​ వద్ద బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల నిరసన 

హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలకు జేమ్స్​ బాండ్​ మాదిరిగా బాండ్​ పేపర్లు రాసిచ్చి.. వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు. ‘అభయహస్తం’ మేనిఫెస్టోతో ప్రజలను నమ్మించి ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్.. ఇవాళ మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నా ఆ హామీల ఊసెత్తకుండా వంచిస్తున్నదన్నారు.

ఆరు గ్యారంటీల అమలుపై శుక్రవారం గన్​పార్క్​ వద్ద బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. కేటీఆర్​ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి, మూడు బడ్జెట్లు కలిపినా 20 వేల కోట్లకు మించలేదన్నారు. వృద్ధులు, వితంతువులు ఎదురుచూస్తున్న రూ.4 వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 18 ఏండ్లు నిండిన 1.58 కోట్ల మంది మహిళలకు ఇస్తామని చెప్పిన రూ.2,500 మహాలక్ష్మి పథకం ఏమైందని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది  దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ హామీ అమలు చేయాలన్నారు. రైతులకు రైతు భరోసా పేరుతో రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పటికే ఉన్న రైతుబంధునే అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఇది యువతను మోసం చేయడమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్​ రాసిచ్చిన బాండ్ పేపర్లు.. ఇవాళ నీటి మీద రాతల్లా మారాయని విమర్శించారు.