తెలంగాణ భూభాగం అర్థం చేసుకుంటే.. కాళేశ్వరం డిజైన్ అర్థమైతది : కేటీఆర్

తెలంగాణ  భూభాగం అర్థం చేసుకుంటే.. కాళేశ్వరం డిజైన్ అర్థమైతది : కేటీఆర్

అవమానాలతోనే రాష్ట్ర ప్రయాణం మొదలైందని.. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎన్నో అపోహాలు, అనుమానాలు రాష్ట్రంపై ఉండేవని.. కానీ ఈరోజు వాటిన్నింటికీ,  అభివృద్ధే సమాధానం చెబుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యాపారవేత్తలు..  ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నామంటూ ముందుకు రారని చెప్పారు.  టిఎస్ఐ పాస్ తో పారిశ్రామికవేత్తలకు మంచి జరిగిందన్నారు. అధికారం అనేది ఎప్పటికీ, ఎవ్వరికీ శాశ్వతం కాదని.. రేపు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మంచిగా చూసుకునే వాళ్ళు వస్తే ఎవరైనా  తప్పుకోవాల్సిందేనన్నారు. 2023, నవంబర్ 8వ తేదీ బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టీఐఎఫ్) సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

గతంలో కొన్ని ప్రాంతాలలో  14 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేది కానీ.. ఇప్పుడు రోజు తప్పి రోజు వస్తున్నాయని చెప్పారు. రానున్న రోజులో 24 గంటలు స్వచ్ఛమైన నీళ్లు వచ్చేలా కృషి చేసే బాధ్యత తనదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ఎన్నో ఇండస్ట్రీస్ హైదరాబాద్ కి వస్తున్నాయంటే దానికి ముఖ్య కారణం రాష్ట్రం నాణ్యత అని, రాష్ట్రం బాగుంటేనే పారిశ్రామిక  వాడలు బాగుంటాయని అన్నారు.

గతంలో అప్పు చేస్తే సమాజం ఉండేది కాదని.. కానీ ఇప్పుడు లోన్స్ తీసుకుంటేనే అభివృద్ధి చెందుతున్నామన్నారు.  మేము కేవలం లోన్స్ మాత్రమే తీసుకున్నామని.. అప్పులు ఎక్కడ చేయలేదని కేటీఆర్ చెప్పారు. విద్య, వైద్యం, తాగునీరు, ఇరిగేషన్, పవర్ పై మాత్రమే లోన్లు తీసుకున్నామని.. స్థాయికి మించిన లోన్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఎవరూ లేరన్నారు.

ప్రతి ఒక్కరు కుటుంబ పరిపాలన అంటున్నారని.. కేవలం మా కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందా?.. తెలంగాణ అభివృద్ధి కాలేదా? అని ప్రశ్నించారు.  మేము తప్పు చేస్తే.. మోడీ మమ్మల్ని వదిలిపెట్టరని... మమ్మల్ని ఏమనట్లేదు అంటే దాని అర్థం మేము తప్పు చేయకుండా పరిపాలన చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని రాహుల్ గాంధీ అంటున్నారని..  ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోమని ఆయన స్పష్టం చేశారు.

మేడిగడ్డపై ఎలాంటి అవగాహన లేకుండ రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్ లో ఓ బ్రిడ్జి కూలిపోయి 133 మంది ప్రాణాలు పోతే ఒక్కరు కూడా మాట్లాడలేదని.. కాళేశ్వరంపై ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ  భూభాగం అర్థం చేసుకుంటేనే.. కాళేశ్వరం డిజైన్ అర్థమవుతుందని చెప్పారు. ఐదు ఎకరాలు ఉండే వారికి మాత్రమే రైతుబంధు వచ్చేలా రానున్న రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

 బీఆర్ఎస్ రానున్న రోజుల్లో ఢిల్లీలో జెండా ఎగరేస్తుందని భయంతోనే మోడీ కేసీఆర్ పై ఆరోపణలు వేస్తున్నారని అన్నారు. మోడీ కన్న ముందు 14 మంది ప్రధాన మంత్రులు అయ్యారని.. వారికంటే14% అధికంగా మోడీ అప్పులు చేశారని అన్నారు. రాష్ట్రంలో  ప్రభుత్వం మారితే మళ్లీ పరిపాలన మొదటికి వస్తుందన్నారు.  33% ఐటి జాబ్స్ హైదరాబాద్ నుండే వస్తున్నాయని.. బెంగళూరు ఐటి కారిడార్ ని హైదరాబాద్ ఐటి కారిడార్ దాటేసిందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి పక్కనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి అర్థమైంది కానీ.. ఇక్కడ ఉండే గజినీలకు మాత్రం అర్థం కావడంలేదని కేటీఆర్ విమర్శించారు.