సర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుత : కేటీఆర్

సర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుత :  కేటీఆర్

సిరిసిల్ల టౌన్‌‌, వెలుగు : ‘‘కరోనా కారణంగా సర్పంచులకు బిల్లులు చెల్లించలేకపోయాం. పెండింగ్ బిల్లులను ఈ సర్కారు ఇస్తుందని ఆశిస్తున్నాం.. లేదంటే మీ తరఫున గొంతు విప్పడానికి నేను సిద్ధంగా ఉంటా’’ అని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే -కేటీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ ఆఫీస్ లో నిర్వహించిన జిల్లా సర్పంచుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఒక్క తెలంగాణలోనే  గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఇందులో సర్పంచుల కృషి ఎంతో ఉందని చెప్పారు. 

తమ హయాంలో 1,858 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, కొత్తగా 9,355 గ్రామ పంచాయతీ సెక్రటరీలను నియమించామని తెలిపారు. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కొత్తగా అడిషనల్ కలెక్టర్ పోస్టును సృష్టించామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రతి పంచాయతీకి డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం కట్టుకున్నామని చెప్పారు. సర్పంచుల కృషి వల్లే రాష్ట్రానికి 81 నేషనల్ లెవల్ అవార్డులు వచ్చాయని వివరించారు. అంతకుముందు పలువురు సర్పంచులను కేటీఆర్ సత్కరించారు.