ప్రజలు మనతోనే ఉన్నారనుకున్నం..అసెంబ్లీ ఎన్నికల వరకు అదే ధీమాలో ఉన్నం : కేటీఆర్

ప్రజలు మనతోనే  ఉన్నారనుకున్నం..అసెంబ్లీ ఎన్నికల వరకు అదే ధీమాలో ఉన్నం : కేటీఆర్
  • పార్టీ నాయకులతో బీఆర్​ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కేటీఆర్
  • పాలనకు ఎక్కువ టైం కేటాయించి.. పార్టీకి తక్కువ కేటాయించినం
  • ఇకపై పార్టీకి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : ‘‘తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశాం.. ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి.. ప్రజలు మనతోనే ఉన్నారని అనుకున్నాం.. అసెంబ్లీ ఎన్నికల వరకు అదే ధీమాలో ఉన్నాం”అని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఆ పార్టీ నాయకులతో​అన్నారు.  బుధవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన వరంగల్​ లోక్​సభ సన్నద్దత సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తం, చెమట ధారపోశారని, విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు మళ్లించారని తెలిపారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి కేసీఆర్​ పడిన కష్టం దేశంలో ఇంకెవరు పడలేదన్నారు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయాలనే తపనతో 99% సమయం పాలనకు కేటాయించామని, దీంతో పార్టీకి తక్కువ టైం కేటాయించామని తెలిపారు. ఇకపై పార్టీకి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ‘‘మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు.

దానిని గుర్తించి ముందుకు సాగుదాం. బీఆర్ఎస్​ను ఉఫ్​మని ఊదేస్తామని కొందరు అంటున్నారు. 23 ఏండ్లుగా చాలా మంది ఆ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కేసీఆర్ ​తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ ​ఉంటుంది. బీఆర్ఎస్ ను​లేకుండా చేయడం ఎవరి తరం కాదు. ఇక నుంచి తెలంగాణ భవనే మన అడ్డా. పార్టీ క్యాడర్​కు నాతో పాటు సీనియర్ ​లీడర్లు అందుబాటులో ఉంటారు. పార్టీని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. పార్టీలో ఆర్ఎస్ఎస్​ నుంచి ఆర్ఎస్​యూ భావజాలం ఉన్నవాళ్లు ఉన్నారు. అందరం కలిసి జట్టుగా పని చేద్దాం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక.. పార్లమెంట్​ఎన్నికల్లో సత్తా చాటుదాం”అని  కేటీఆర్​ పిలుపునిచ్చారు.

కేసులకు భయపడేది లేదు

కాంగ్రెస్​అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, వాటికి భయపడేది లేదని కేటీఆర్​ అన్నారు. పార్టీకి పటిష్టమైన లీగల్​ సెల్​ ఉందని, కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుందని తెలిపారు. ఉద్యమాల వీరగడ్డ ఓరుగల్లు అని.. జిల్లాలోని నాయకులు నిత్యం ప్రజల మధ్య ఉన్నా ఓడిపోయారన్నారు. జయశంకర్ ​సార్ ​పుట్టిన నేలపై 2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో వరంగల్​ఎంపీ సీటు గెలిచామని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగరాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనబెట్టి లోక్​సభ ఎన్నికల్లో విజయంపై దృష్టి పెట్టాలని, కార్యకర్తలను కలుపుకొని పని చేయాలని నాయకులకు సూచించారు. కాంగ్రెస్​ ఇచ్చింది 6 గ్యారంటీలు మాత్రమే కాదు.. 420 హామీలన్న విషయం ప్రజలకు గుర్తు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​కు కేటీఆర్ ​చురకలంటించారు.

అసెంబ్లీకి లేటే.. పార్టీ మీటింగ్​కు లేటేనా? అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్​ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం కాంగ్రెస్ ​వల్ల కాదన్నారు. కేసీఆర్​నాయకత్వంలో అందరం కష్టపడి పనిచేసి లోక్​సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుందామన్నారు.