కేటీఆర్.. ఆ దయ్యాలు ఎవరో చెప్పు.. మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్​

కేటీఆర్.. ఆ దయ్యాలు ఎవరో చెప్పు.. మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ చుట్టూ చేరిన దయ్యాలెవరో కేటీఆర్  చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పై విమర్శలు చేసే ముందు బీఆర్ఎస్ లోని అంతర్గత పోరుపై దృష్టి పెట్టాలని కేటీఆర్​కు సూచించారు. తమ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని, వాటిపై స్పందించాల్సిన అవసరం తమకు లేదన్నారు. కవిత ఆరోపణలకు కేటీఆర్ జవాబు ఇస్తేనే..  సీఎంపై వాళ్లు చేసిన ఆరోపణలకు తాము జవాబిస్తామని చెప్పారు. 

తీవ్ర అసహనంలో కేటీఆర్: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 

ఇంట్లని సమస్యలు పరిష్కరించుకోలేక కేటీఆర్ అసహనంలో ఉన్నారని  కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్  ఆరోపించారు. బీజేపీపై సీఎం రేవంత్ ఏ స్థాయిలో పోరాడుతున్నాడో కనీస అవగాహన లేని సన్నాసి కేటీఆర్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దొంగల దొడ్డిగా మార్చిన దొంగల కుటుంబం కేటీఆర్ ది అని అన్నారు. 

పదేండ్లు దోచుకున్నది బయటపడ్తున్నది : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​  

కవిత లేఖతో బీఆర్ఎస్  పదేండ్లలో దోచుకున్నది బయటపడుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాటు చేసిన పాపాలను కవిత తన లేఖలో బయటపెట్టారని ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆరోపించిన కవిత.. ఆ దయ్యాలు కేటీఆరా.. హరీశ్​ రావా.. చెపితే బాగుండేదన్నారు. సీఎం రేవంత్ పై, కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్.. ముందు ఇంటి సమస్యను సరిచేసుకోవాలని సూచించారు. 

లొట్టపీసు గాండ్లు అనే జనం ఇంటికి పంపారు:  కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి 

సీఎం రేవంత్ రెడ్డిని లొట్టపీసు అంటూ కేటీఆర్ విమర్శిస్తున్నారని, లొట్టపీసుగాండ్లు వద్దనే కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు ఇంటికి పంపారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి విమర్శించారు. తాము కూడా ఉప్పు, కారం తింటున్నామని, మాట్లాడాలనుకుంటే కేటీఆర్ కన్నా ఎక్కువ మాట్లాడగలమని హెచ్చరించారు. 

కవితను పార్టీ నుంచి పంపించే ప్రయత్నం: పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి 

రోజూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కేటీఆర్.. ముందు ఆయన పార్టీలో జరుగుతున్న గొడవపై స్పందించాలని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేస్తున్న కేటీఆర్.. వాళ్ల పార్టీలోని కుమ్ములాటలపై దృష్టి పెట్టాలన్నారు. తండ్రి, బిడ్డల మధ్య ఇంత గ్యాప్ సృష్టించిన దయ్యం ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. కవితను  పార్టీ నుంచి పంపించే ప్రయత్నం  జరుగుతున్నదన్నారు. 

తెలంగాణకు పట్టిన దయ్యం కేటీఆర్: చనగాని దయాకర్ 

తెలంగాణకు పట్టిన దయ్యం కేటీఆర్ అని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఆధిపత్యం కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని..తన సొంత చెల్లి, మేన బావ పార్టీలో ఉండడాన్ని కూడా ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కే కాదు, రాష్ట్ర అభివృద్ధికి కూడా కేటీఆర్ దయ్యంగా మారారని ధ్వజమెత్తారు.