కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తుండు : యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

 కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తుండు : యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పంపిన లీగల్‌ నోటీసులపై  మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి స్పందించారు.  కేటీఆర్‌..లీగల్‌ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.  విచారణ చేయాలని అడుగుతుంటే పరువు తీశామని కేటీఆర్‌ అంటున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో బాధితుడిగా తాను పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు యెన్నం.  ఆధారాలు ఉన్నందుకే పోలీసు అధికారులు విచారిస్తున్నారని తెలిపారు.  తాను  కేటీఆర్‌ స్థానంలో ఉంటే ఫోన్‌ ట్యాపింగ్‌లో తన పాత్ర లేదని అధికారలకు లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు  యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డితో పాటుగా  మంత్రి కొండా సురేఖకు కేటీఆర్  లీగల్ నోటీసులు పంపించారు. వీరితోపాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్ కి మరోసారి లీగల్ నోటీసులు పంపించారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా సరే వదిలిపెట్టేది లేదని..   చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే తేల్చిచెప్పారు కేటీఆర్. 

ALSO READ :- చిక్కుల్లో పృథ్వీషా.. వేధింపులపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశాలు