ఈడీ, ఐటీ, సీబీఐ దాడులపై కేంద్రానికి కేటీఆర్ చురక

ఈడీ, ఐటీ, సీబీఐ దాడులపై కేంద్రానికి కేటీఆర్ చురక

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇటీవలే ప్రధానికి  బహిరంగ లేఖ రాసిన మంత్రి కేటీఆర్ .. తాజాగా ట్విట్టర్ వేదికగా బీజేపీకి చురకలు అంటించారు.  కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐతో పాటు ఐటీ దాడులకు సంబంధించి కేంద్రాన్ని ప్రశ్నిస్తూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్తో కేటీఆర్ ట్వీట్ చేశారు. "గత ఎనిమిదేళ్లలో బీజేపీ నేతలు, వారి బంధువులు, సన్నిహితులపై ఎన్నిసార్లు ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి? బీజేపీ నేతల బంధువులంతా సత్యహరిశ్చంద్రుని బంధువులా" అని ట్విట్టర్ లో ప్రశ్నించారు.


ఇదిలా ఉంటే శుక్రవారం మంత్రి కేటీఆర్ యువ‌త ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల భ‌ర్తీపై ప్రధాని మోడీకి బ‌హిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ హామీ ఏమైందని, ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతుంద‌న్నారు. ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించామ‌ంటున్న ప్రధాని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేయకపోగా, ఉన్న అవకాశాలపై దెబ్బ కొడుతోందని కేటీఆర్ విమర్శించారు.