వాళ్లేం చేస్తరో.. ఎట్ల దిగిరారో చూస్తం

 వాళ్లేం చేస్తరో.. ఎట్ల దిగిరారో చూస్తం

హైదరాబాద్​, వెలుగు: ప్రజలను ఇబ్బంది పెడితే కంటోన్మెంట్​కు కరెంట్​, నీళ్లు బంజేస్తామని, వాళ్లు ఏం చేస్తారో, ఎట్ల దిగిరారో చూస్తామని మంత్రి కేటీఆర్​ హెచ్చరించారు. రోడ్లను మూసేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులకు కంటోన్మెంట్​ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. వాళ్లేదో స్వతంత్ర దేశంలో ఉన్నట్టు.. తెలంగాణ మరో దేశమైనట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంచిగా అడిగితే కంటోన్మెంట్​ వాళ్లకు అర్థం కావడం లేదని, తాము ఏం చేయాల్నో అది చేసి చూపిస్తామని హెచ్చరించారు. చివరిగా ఇంకొకసారి కంటోన్మెంట్​ వాళ్లను పిలిచి మాట్లాడాలని, వినకుంటే కఠిన చర్యలకూ వెనుకాడవద్దని సీఎస్​ సోమేశ్​ కుమార్​కు ఆదేశాలిచ్చారు. శనివారం అసెంబ్లీలో హైదరాబాద్​ సిటీలో నాలాలు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్​ సమాధానం చెప్పారు. కంటోన్మెంట్​ వాళ్లు తమ పరిధిలోని నాలా మీద చెక్​డ్యాం కట్టారని, దీని వల్ల వానకాలం అక్కడ నీళ్లు నిలిచి నదీం కాలనీ మునుగుతోందన్నారు. దీంతో షాతమ్​ చెరువు నీటిని గోల్కొండ కింద నుంచి వదిలేందుకు అనుమతులు అడిగినా.. ఆర్కియాలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా ఒప్పుకోవడం లేదన్నారు.  నాలాల అభివృద్ధి కోసం చేపట్టిన ఎస్​ఎన్​డీపీకి రూ.985 కోట్లు ఖర్చు చేస్తున్నామని, అందులో కేంద్రం వాటా ఒక్క పైసా లేదన్నారు. 

కేంద్రంతో పడదు

కేంద్రంతో తమకు రాజకీయంగా పడదని, వాళ్లు పెద్దగా సహకరించరని మంత్రి కేటీఆర్ అన్నారు. కొంతమంది కేవలం అందమైన నినాదాలు ఇస్తారని, వాటికి విధానాలంటూ ఏమీ ఉండవని విమర్శించారు. స్మార్ట్ సిటీ డైలాగ్ కొట్టగానే అయిపోతుందన్నంత బిల్డప్ ఇస్తారని, కార్యాచరణ, నిధుల కూర్పు వంటివి ఏమీ ఉండవని ఎద్దేవా చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌‌మెంట్ బడ్జెట్ పద్దుపై అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి నీటి సరఫరాను ఈ ఏడాదిలో వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నంబర్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. 

నేను స్కూల్‌‌కు లేట్.. భట్టి పార్టీనే కారణం

‘‘నేను హైదరాబాద్‌‌ అబిడ్స్‌‌లోని గ్రామర్ స్కూల్‌‌లో చదువుకున్న. ఎర్రమంజిల్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌లో మేం ఉండేటోళ్లం. అక్కడి నుంచి 135 నంబర్ బస్సు ఎక్కి స్కూల్‌‌కి వెళ్తుండె. ఆ బస్సు ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముందు నుంచి పోతుండె. ఎండకాలం వచ్చిదంటే ట్రాఫిక్ జామ్ అయిపోయి.. స్కూల్​కు లేట్ అయితుండే. ఇందుకు భట్టి విక్రమార్క, ఆయన పార్టీనే కారణం. ఏటా ఎండాకాలం వచ్చిదంటే ఖాళీ కుండలు, బిందెలతో జనం వచ్చేటోళ్లు. ఖైరతాబాద్ జలమండలి ముందు యుద్ధాలు జరిగేవి.నా కండ్లతో వందలసార్లు చూసిన” అని కేటీఆర్ వివరించారు