హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, దీనికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఫీర్జాదిగూడలో ఇండ్ల కూల్చివేతపై మండిపడ్డారు. ఆ ప్లాట్లను రాందాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకులు ప్రజలకు విక్రయించారని, వాటిని 2008లో వైఎస్సార్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకుని ప్రజలు ఇండ్లు నిర్మించుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ నాయకుడు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను వేధించి, కక్షపూరితంగా అమాయక ప్రజల ఇండ్లను కూల్చివేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయించి, బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. బీఆర్ఎస్ నేత, మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను కాంగ్రెస్ వేధిస్తోందని మండిపడ్డారు.
