రైతులు అనాథలుగా మారారు..వడ్ల కుప్పపై రైతు మరణం సర్కారు​ చేసిన హత్యే : కేటీఆర్​

రైతులు అనాథలుగా మారారు..వడ్ల కుప్పపై రైతు మరణం సర్కారు​ చేసిన హత్యే : కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలుతుంటే.. ఇంకోవైపు వడదెబ్బకు తాళలేక ఓ రైతు ధాన్యపు కుప్పలపైనే ప్రాణాలు విడిచిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నదని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు కిషన్ (51) అనే రైతు పంట కొనుగోలు కేంద్రంలో వడ్లకుప్పపైనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసిన హత్యేనని విమర్శించారు.

పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి, రుణమాఫీ పేరిట మోసం చేసి, పండిన పంటను కోనుగోలు చేయకపోవడం వల్లే రైతన్నలు అనాథలా మారారన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఓవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాలతో కండ్ల ముందే నాశనమవుతున్నదని, మరోవైపు మండుతున్న ఎండలను తట్టుకోలేక రైతులు బలవుతున్నారని పేర్కొన్నారు. ఈ దయనీయ పరిస్థితులకు దద్దమ్మ కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కార్మిక పక్షపాతి అని, కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు. తెలంగాణ భవన్‌‌‌‌లో నిర్వహించిన నాయిని నర్సింహారెడ్డి జయంతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఓ సోదరుడిగా రెండు దశాబ్దాల పాటు ఇద్దరూ కలిసి పనిచేశారన్నారు. ఉద్యమకాలంలో పార్టీ నేతలకు స్ఫూర్తినిచ్చారన్నారు. నాయిని నర్సింహా రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.