హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పూర్తిగా సహకరించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతల వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరని వారిని అడిగానని.. అయితే.. లీకులతో మాకు సంబంధం లేదని అధికారులు చెప్పారన్నారు.
హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని పోలీసులు చెప్పారని తెలిపారు. లీకులను ఎవరూ నమ్మొద్దని.. లోపల ఏదో జరిగిపోతుందని బయట తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. వేధింపుల తప్ప సిట్ విచారణలో ఏమి లేదని.. ఈ కేసులో ఏదైనా ఉంటే కదా ఉక్కిరి బిక్కిరి అయ్యేదన్నారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి వేధించారని ఆరోపించారు. ఎన్నిసార్లు పిలిచినా సిట్ విచారణకు వెళ్తామని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం (జనవరి 23) కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు, ఎలక్టోరల్ బాండ్లు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి కేటీఆర్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.
►ALSO READ | ముగిసిన కేటీఆర్ విచారణ.. 7 గంటల పాటు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి..!
అలాగే ఈ కేసులో నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, కేటీఆర్‌ను కలిపి గంట పాటు ఇన్విస్టిగేట్ చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలక్షేప కథాచిత్రం నడుపుతున్నారన్నారు. సింగరేణి టెండర్లలో అవకతవకలపై ఆధారాలతో హరీష్ రావు బయటపెట్టినా ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. స్వయంగా మంత్రి కుమారుడు గుండాగిరి చేస్తున్నా.. చర్యలు లేవు.. అక్కడ సిట్ కూడా లేదని అన్నారు.
బొగ్గు కుంభకోణం కేసులో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కింగ్ పిన్ అని ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉన్నదా అని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు అవినీతికి పాల్పడుతుంటే సిట్ ఎందుకు వేయరని.. న్యాయం, ధర్మం అందరికీ ఒకేలా ఉండాలని పేర్కొన్నారు. ఇది లీకుల ప్రభుత్వమని.. లీకులపై ఆధారపడి పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి విచారించారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తనను ఎవరితో కలిసి విచారించలేదని తెలిపారు. తాను సిట్ అధికారులను బెదిరించలేదని తెలిపారు. బాధ్యత గల ప్రతిపక్షంగా విచారణకు సహకరిస్తామని చెప్పారు.
