
- ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్త
- నాలుగున్నరేండ్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న
- బీఆర్ఎస్ లేని తెలంగాణ కోసం పోరాడుతా
- రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే
- విలువల్లేని వ్యక్తుల చేతుల్లో రాష్ట్రం బందీ అయిందని విమర్శ
నాగర్‌కర్నూల్, వెలుగు: బీఆర్ఎస్ను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని, ఎమ్మెల్సీగా నాలుగున్నరేండ్లు కొనసాగే అవకాశం ఉన్నా.. ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు బీఆర్ఎస్ అసంతృప్త నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. విలువల్లేని బీఆర్ఎస్లో కొనసాగడం కంటే రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిదనిపించిందన్నారు. తన కొడుకు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో పాటు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో తనను నమ్ముకున్న వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరుతారని స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్‌లో ఆదివారం డీసీసీ ఆఫీస్ ఓపెనింగ్‌కు హాజరైన దామోదర్ రెడ్డి తర్వాత మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని, సిద్ధాంతాలు, వైరుధ్యాలను ప్రజలు పెద్ద సమస్యగా చూడటం లేదన్నారు. బీఆర్ఎస్ లేని తెలంగాణ కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్ కోసం అందరూ ఏకమవుతున్నారని, ప్రస్తుతం ఏ విలువల్లేని వ్యక్తుల చేతుల్లో రాష్ట్రం బందీ అయిందని విమర్శించారు. బీఆర్ఎస్లో వ్యక్తులను కాకుండా వ్యక్తిత్వాన్ని చంపేస్తారన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఒకరిని గెలిపించిన పాపానికి నాలుగేండ్లు అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఒకేపార్టీలో ఉంటూ చిల్లర పంచాయితీలు పెట్టుకునే తత్వం తనది కాదన్నారు. ప్రజల ఆస్తులు, రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. ఈనెల 20న కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో పార్టీలో చేరుతానని ప్రకటించారు.
టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం
వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో కలిసి ముందుకెళ్తానన్నారు. నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నుంచి పార్టీ టికెట్ కేటాయించే విషయంలో సర్వేల ఆధారంగా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని తెలిపారు. పార్టీ టికెట్ తన కుమారుడికి వచ్చినా, నాగం జనార్దన్ రెడ్డికి వచ్చినా అంకిత భావంతో పని చేస్తానని వివరించారు.