
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సహస్రను దారుణంగా హత్య చేసిన మైనర్ నిందితుడిని పోలీసులు కస్టడీకి కోరారు. ఐదు రోజుల పాటు బాలుడిని కస్టడీకి ఇవ్వాలని మేడ్చల్ కోర్ట్‌లో కూకట్‌పల్లి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు ప్రస్తుతం సైదాబాద్ జువైనల్ హోమ్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. బాలికను పక్కింట్లో ఉండే పదో తరగతి బాలుడే హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. చోరీ చేయడం కోసం సహస్ర ఇంటికి వెళ్లిన నిందితుడు.. దొంగతనం చేస్తుండంగా చూసిందనే కారణంతో బాలికను దారుణంగా హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.
దొంగతనం ఎలా చేయాలి..? తర్వాత ఎలా ఎస్కేప్ కావాలి..? ఒకవేళ దొంగతనం చేస్తూ పట్టుబడితే ఎలా తప్పించుకోవాలి..? అని నిందితుడు ముందే పక్కా స్క్రిప్ట్ రాసుకుని చోరీ ప్లాన్ చేశాడు. ప్లాన్‌లో భాగంగా దొంగతనానికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర నిందితుడిని చూసింది. దీంతో తన దొంగతనం విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయంతో సహస్రను దారుణంగా హత్య చేశాడు. సహస్ర అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ టెక్కీ ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.