
కూకట్ పల్లి సహస్ర హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. గత నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్నా చిక్కుముడి వీడని ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. సహస్రను చంపింది ఎవరు ?,ఇందుకోసం హత్య చేసి ఉంటారు ?, నిందితుడు ఎక్కడ ?, వంటి ప్రశ్నలకు పోలీసులు సైతం సమాధానం దొరకడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఐదు టీమ్స్ తో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గురువారం ( ఆగస్టు 21 ) సహస్ర తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారిస్తున్నారు పోలీసులు.
సుమారు ఏడు గంటలపాటు సహస్ర పేరెంట్స్ ను విచారించిన పోలీసులు వారి దగ్గర నుంచి కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ హిస్టరీ, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ,ఇంటి సమీపంలో అనుమానితులు, పాత కక్షలు, కుటుంబ కలహాలు, గొడవలు, ఎవరి పైనైనా అనుమానం ఉందా అనే కోణంలో పేరెంట్స్ నుండి వివరాల సేకరించారు పోలీసులు. అయితే.. తమకు ఎవరిపై అనుమానం లేదని.. ఎవరితో గొడవలు లేవని సహాస్ర పేరెంట్స్ చెబుతుండటంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది.
అంతే కాకుండా మూడో వ్యక్తి ప్రవేశించినట్లు ఎక్కడా కూడా క్లూ దొరకకపోవడం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ క్రమంలో అంతుచిక్కని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.. ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకపోతే.. సహస్రను చంపింది ఎవరు అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఘటన జరిగిన బిల్డింగ్ లో ఉన్నవారిని, స్థానికులను కూడా ప్రశ్నించారు. మరి, పోలీసులకు సైతం ఛాలెంజింగ్ గా మారిన ఈ కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుందో చూడాలి.