IND vs ENG: స్పిన్నర్ల తడాఖా.. తక్కువ స్కోర్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్

IND vs ENG: స్పిన్నర్ల తడాఖా.. తక్కువ స్కోర్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్

ధర్మశాల టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లీష్ జట్టు.. తొలి సెషన్ లో బాగానే ఆడినా.. ఆ తర్వాత కుప్పకూలింది. ముఖ్యంగా లంచ్ తర్వాత భారత స్పిన్నర్ల ధాటికి సమాధానమే లేకుండా పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌటయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా.. వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జడేజాకు ఒక వికెట్ దక్కింది. 

టీ విరామానికి 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. చివరి రెండు వికెట్లను మరో 24 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఈ రెండు వికెట్లు కూడా అశ్విన్ ఖాతాలోకి వెళ్లాయి. అంతకముందు కుల్దీప్ యాదవ్ విజ్రంభించడంతో రెండు సెషన్ లో 6 వికెట్లను కోల్పోయింది. తొలి సెషన్ లో డకెట్, పోప్ వికెట్లను తీసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్.. రెండో సెషన్ లో మరింతగా రెచ్చిపోయాడు. హాఫ్ సెంచరీ చేసి ప్రమాదకరంగా మారుతున్న క్రాలే(79) బౌల్డ్ చేశాడు. ఇదే ఊపులో బెయిర్ స్టో (29) ను ఔట్ చేసిన కుల్దీప్.. వెంటనే స్టోక్స్ ను డకౌట్ చేసి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు.  

ALSO READ :- IND vs ENG: కుల్దీప్ మాయ.. టఫాటఫా రాలుతున్న ఇంగ్లాండ్ వికెట్లు

మరో ఎండ్ లో అశ్విన్ లోయర్ ఆర్డర్ ను చక చక వెనక్కి పంపాడు. ఒక దశలో వికెట్ నష్టానికి 100 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్.. 118 పరుగుల వ్యవధిలో తమ చివరి 9 వికెట్లను కోల్పోయింది. క్రాలే 79 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగిలిన ఏ ఒక్కరు కూడా 30 పరుగుల మార్క్ టచ్ చేయలేకపోయారు.