
తిరువనంతపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో 275 సంవత్సరాల తర్వాత 2025, జూన్ 8న స్థూపిక ప్రతిషత మహా కుంభాభిషేకం జరిగింది. కుంభాభిషేకంతో పాటు 300 సంవత్సరాల పురాతన విశ్వక్సేన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించడంతో పాటు తిరువంబడి శ్రీ కృష్ణ స్వామి ఆలయంలో అష్టబంధ కలశం వేడుక కూడా అట్టహాసంగా నిర్వహించారు. విశ్వక్సేనుడి విగ్రహం ఒట్టక్కల్ మండపం ఈశాన్య మూలలో దక్షిణం వైపు ఉన్న ప్రత్యేక మందిరంలో ప్రతిష్టించారు.
వేలాది మంది భక్తుల నడుమ మంత్రోచ్ఛారణల మధ్య ఈ మహా కుంభాభిషేకం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ పద్మనాభస్వామి ఆలయ వంశపారంపర్య సంరక్షకుడు మూలం తిరునాల్ రామవర్మ అష్టబంధం వేడుకను నిర్వహించారు. ఈ ఆచారం ప్రకారం ఎనిమిది వస్తువులను ఉపయోగించి విగ్రహం, దాని పీఠాన్ని బిగిస్తారు. -తెల్లటి శంఖం, కడుక్క పండు, చెంచాలయం ఆయుర్వేద మొక్క, కోలరక్కు, కోజిపరల్, పెరట్టుమనల్, జామ, నువ్వుల నూనె ఈ తంతులో ఉపయోగిస్తారు.
భక్తుల నమ్మకం ప్రకారం శ్రీ అనంత పద్మనాభుడు తిరువనంతపురం నగర సంరక్షకుడు, పూర్వపు ట్రావెన్కోర్ రాజ్యానికి అధిపతి. ప్రజల కష్టాలన్నీ తొలగించి.. ప్రజలు శ్రేయస్సు, పురోగతిని సాధించడానికి ఈ మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. 300 సంవత్సరాల తర్వాత విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించిన విశ్వక్సేనుడిని మహా విష్ణువు మరొక రూపంగా భక్తులు భావిస్తారు. శ్రీ పద్మనాభుడికి చెందిన అన్ని సంపదలకు దేవుడిని కాపలాదారుగా కూడా విశ్వక్సేనుడిగా పరిగణిస్తారు.
ఆలయ ప్రధాన పూజారి తరనల్లూరు సతీశన్ నంబూద్రిపాద్ ఆధ్వర్యంలో ఈ మహా కుంభాభిషేకం పూజలు జరిగాయి. ఈ ప్రత్యేక పూజలకు కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ హాజరయ్యారు. విల్వమంగళం స్వామియార్, యోగతు పొట్టిస్, ఆలయ పరిపాలనా కమిటీ సభ్యులు ఆదిత్యవర్మ, కరమన జయన్, ఎ వేలప్పన్ నాయర్, కార్యనిర్వహణాధికారి బి మహేష్, మేనేజర్ బి శ్రీకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.