పెద్దపులి సంచారంతో వణికిపోతున్న జనం

పెద్దపులి సంచారంతో వణికిపోతున్న జనం

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులను పెద్దపులి వణికిస్తోంది. రెండు వారాలుగా జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి.. వరుసగా జంతువులపై దాడి చేస్తోంది. దీంతో రైతులు, గ్రామస్తులు బయటకు వెళ్లాలంటేనే గజగజ వణికిపోతున్నారు. రాత్రి బెజ్జూరు మండలంలోని కుకుడా గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. దీంతో అటవీ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా పులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు. బాబాసాగర్ ఏరియా కుంట వద్ద స్థానికులకు పులి కనిపించింది.

కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి, బెజ్జూర్ మండలాల సరిహద్దులో పెద్దపులి సంచారం చేస్తోంది. కొత్తగూడ దగ్గర పంట పొలాల్లో ఉన్న కుంటలో నీటిని తాగి బాబాసాగర్ ప్రాజెక్టు సమీపంలో పులి ఉన్నట్టు తెలుస్తోంది. పులి అడుగులను గుర్తించిన యానిమాల్ ట్రాకర్స్.. చుట్టుపక్కల పంట పొలాల్లోని రైతులు, కూలీలను అప్రమత్తం చేస్తున్నారు.



రెండు రోజుల క్రితం కాగజ్ నగర్ మండలంలోని వేంపల్లి, అనుకోడ గ్రామ శివారులో కొందరు ప్రయాణికులకు పెద్దపులి కనిపించింది. పులాస్ సర్దార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. ఖానాపూర్, కాగజ్ నగర్, ఈజ్ గాం మీదుగా పెద్దపులి వేంపల్లికి చేరుకుందన్నారు. దాని ఆచూకీ కోసం 12 బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. గ్రామంలోకి పెద్దపులి రావడంతో భయందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. 

ఆదిలాబాద్ జిల్లా తాంసి కే శివారులో అవుల మందపై పెద్దపులులు దాడి చేశాయి.  దాడిలో ఒక ఆవు చనిపోయింది. భయంతో ఇద్దరు పశువుల కాపరులు  చెట్టెక్కారు. పులిని తరిమికొట్టేందుకు కర్రలతో అడవిలో తిరుగుతున్నారు గ్రామస్తులు. ఇప్పటికే వ్యవసాయ పనులు చేస్తున్న వారిని ఇండ్లకు ఫారెస్ట్ అధికారులు పంపించి వేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని.. గుంపులు గుంపులుగా తిరగాలని సూచిస్తున్నారు.