
- సీఎం రేవంత్‌కు కూనంనేని లేఖ
హైదరాబాద్, వెలుగు: ‘సెప్టెంబర్ -17’ను తెలంగాణ విలీన దినోత్సవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను నిరుడు తెలంగాణ ప్రజా పరిపాలన దినంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా అదే పేరుతో నిర్వహించనున్నట్లు తెలిసింది.
అయితే.. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజా పరిపాలన దినోత్సవంగా కాకుండా.. ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా నిర్వహించాలి” అని పేర్కొన్నారు. నాటి తెలంగాణ పోరాటాన్ని, రైతాంగ సాయుధ పోరాటాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. అమరవీరుల స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అందులో ఆనాటి పోరాటంలో అసువులు బాసిన అమరుల పేర్లు, ఫొటోలు ఉండేలా మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు.