గ్రీన్ పోలీస్ స్టేషన్

గ్రీన్ పోలీస్ స్టేషన్

పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే ఏదోతెలియని భయం.. అక్కడి స్టాఫ్ ఎలాఉంటారా? అని జనాలుఅనుకుంటారు. కానీ, మహబూబాబాద్ జిల్లాలోని కురవి పోలీస్ స్టేషన్ కు వెళ్తే..అలాంటి ఆలోచన అవసరం రాలేదు. సిబ్బంది ఫ్రెండ్లీగా ఉంటారు. పైగా అక్కడి పరిసరాలు పచ్చని చెట్లు ,పూలు, పండ్ల మొక్కలతో కనిపిస్తాయి.మహబూబాబాద్ – మరిపెడ ప్రధాన జాతీయ రహదారి పక్కనే విశాలమైనస్థలంలో ఈ పోలీస్ స్టేషన్ ఉంది.

జిల్లాలోని కురవి పోలీస్ స్టేషన్ 2013 ఆగస్టు 20న ప్రారంభమైంది. అప్పుడు ఇక్కడ పనిచేస్తున్న సీఐ జి.రవీందర్,ఎస్సై సూర్యప్రసాద్ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ముందుగానే పచ్చదనం కోసంమొక్కలు పెంచాలనుకున్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని కడియంలోని నర్సరీ నుంచి రూ.85 వేలతో మామిడి, సపోట, బాదం, జామ,తెల్ల ఉసిరి, అరటి, నిమ్మ, టేకు, అశోక వేప,గులాబీ, కనకాంబరం, తెల్లజాజి, కాగితం పూలమొక్కలు తెప్పించి.. నాటారు. గ్రీన్ గ్రాస్ తెప్పించి రహదారికి రెండు వైపులా నాటారు. ఇక్కడపనిచేసే సిబ్బందే మొక్కల సంరక్షణ బాధ్యతతీసుకున్నారు. అప్పుడు నాటిన దాదాపు మూడువేల మొక్కలు ఇప్పుడు చెట్లుగా మారాయి.

చెట్ల నీడన సేద తీరుతున్నఫిర్యాదుదారులు
కురవి పోలీస్స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు,బాధితులు ఇక్కడున్న పచ్చని చెట్ల కింద సేదతీరుతున్నారు. ఇక్కడ కాస్తున్న పండ్లను సిబ్బంది ఇళ్లకు తీసుకెళ్తుంటారు. కోత ఎక్కువగా వస్తేబయటి వాళ్లకు కూడా ఇస్తున్నారు.

గ్రీనరీలో జిల్లా లో ఫస్ట్

మొక్కల్ని పశువులు తినకుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రహరీ కట్టారు. సిబ్బంది సైతం ప్రతి రోజు మొక్కలకు నీళ్లు పోయడం, పరిసరాలను శుభ్రం చేయడం లాంటి పనులుచేస్తుంటారు. సిబ్బంది శ్రమకు తగ్గట్టుగానే..గ్రీనరీలో జిల్లాలోనే కురవి పోలీస్ స్టేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘హరితహారం’ పథకానికి ఈ పోలీస్స్టేషన్ ఆదర్శంగా నిలిచింది. పోలీస్ స్టేషన్లో సిమెంట్ దిమ్మలతో మినీ కొలనుఏర్పాటు చేయడంతో పాటు రెండు బాతులుపెంచుతున్నారు సిబ్బంది.

పచ్చదనంలో ఆదర్శం
పోలీసులు శాంతి భద్రతలతో పాటు ఏరంగంలోనైనా ఆదర్శంగా నిలుస్తారని ఇక్కడిసిబ్బంది రుజువు చేశారు.ఇక్కడి సిబ్బంది మొక్కల్ని పెంచడం సామాజికబాధ్యతగా తీసుకోవడం గొప్ప విషయం.పచ్చదనం విషయంలోనే కాదు.. రాష్ట్రం లోనేఅత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా నిలపడం కోసం సిబ్బంది పోటీ పడి పని చేస్తున్నారు.– నంద్యా ల కోటిరెడ్డి, మహబూబాబాద్ ఎస్పీ