అలంపూర్ జోగులాంబకు పట్టువస్ర్తాలు సమర్పించిన కర్నూలు కలెక్టర్

అలంపూర్ జోగులాంబకు పట్టువస్ర్తాలు సమర్పించిన కర్నూలు కలెక్టర్

అలంపూర్: జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు కర్నూలు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి. ఏటా విజయదశమి పండుగ సందర్భంగా  కర్నూలు జిల్లా తరపున అలంపూర్ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనాదిగా ఆచారంలా వస్తోంది. ముఖ్యంగా కర్నూలుకు తూర్పు దిక్కున ఉన్న శక్తిపీఠం కావడంతో ఈ సంప్రదాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్యంగా పట్టణ వాసులు ముఖ్య పండుగలు… కార్యక్రమాలకు అలంపూర్ జోగులాంబను దర్శించుకోవడం ఆనవాయితీ. శివరాత్రి వంటి పర్వదినాలలో పాదయాత్ర చేస్తూ మరీ వస్తారు. ఇలా కర్నూలు వాసులకు అలంపూర్ తో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది.

పూర్వం నుండి వస్తున్న సంప్రదాయం మేరకు ఏపీ  ప్రభుత్వం తరఫున కర్నూలు జిల్లా ఇంఛార్జి కలెక్టర్ రవి పట్టన్ షెట్టి ఆదివారం ఉదయమే అలంపూర్ కు చేరుకున్నారు. పట్టుపంచె ధరించి ఆలయానికి వచ్చిన కర్నూలు కలెక్టర్ కు జోగులాంబ జిల్లా అధికారులు, ఆలయ ఈవో, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కర్నూలు కలెక్టర్ రవి పట్టన్ షెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.