కనులపండువగా ఉద్దాల ఊరేగింపు

 కనులపండువగా ఉద్దాల ఊరేగింపు
  •     వడ్డేమాన్‌‌‌‌‌‌‌‌ గ్రామం నుంచి ఆలయం వరకు 12 కిలోమీటర్లు సాగిన యాత్ర 
  •     ఉద్దాలను తాకేందుకు పోటీ పడిన భక్తులు
  •     భారీ సంఖ్యలో హాజరైన భక్తులు


చిన్నచింతకుంట, వెలుగు : మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామ శివారులోని కురుమూర్తి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉద్దాలోత్సవం కనులపండువగా సాగింది. ఈ వేడుకను చూసేందుకు ఉమ్మడి పాలమూరుతో పాటు కర్నాటక, ఏపీ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కురుమూర్తి గుట్టలు కిక్కిరిసిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌‌‌‌‌‌‌‌ గ్రామంలోని ఉద్దాల మండపంలో అత్యంత నియమ నిష్ఠలతో తయారు చేసిన ఉద్దాలను మంగళవారం ఊరేగింపుగా కురుమూర్తి ఆలయానికి తరలించారు. ముందుగా పళ్లమర్రి గ్రామానికి చెందిన మేదరులు తయారు చేసిన చాటలో ఉద్దాలను ఉంచారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసుదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ కొత్తకోట సీతా దయాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉద్దాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

 మధ్యాహ్నం 2.45 గంటలకు వడ్డేమాన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఉద్దాల ఊరేగింపును ప్రారంభించారు. వడ్డేమాన్, -​అప్పంపల్లి గ్రామాల మధ్యలో ఊక చెట్టు వాగు మీదుగా ఉద్దాలను తరలిస్తుండగా వాటిని తాకేందుకు ప్రజలు పోటీ పడ్డారు. అప్పంపల్లికి చేరుకున్న తర్వాత ప్రత్యేకంగా తయారుచేసిన వాహనంలోకి ఉద్దాలను చేర్చారు. అక్కడి నుంచి తిర్మలాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామం మీదుగా సాగిన ఊరేగింపు రాత్రి ఏడు గంటలకు కురుమూర్తి జాతర మైదానానికి చేరుకుంది. ఈ సమయంలో శివసత్తులు పునకాలతో ఊగిపోయారు. జాతర మైదానంలో మూడు రౌండ్ల పాటు తిప్పిన ఉద్దాలను ఆలయ రాజగోపురం దగ్గరకు తీసుకొని రాగానే... ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, ఆలయ సిబ్బంది వాటిని మండపానికి చేర్చారు. 12 కిలోమీటర్ల మేర సాగిన ఉద్దాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ డి. జానకి బందోబస్తును పర్యవేక్షించారు.