- రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించి అదనపు నిబంధనల అంశంపై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్కే2డబ్ల్యూడీటీ) తమకు తన తుది నిర్ణయాన్ని సమర్పించలేదని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కృష్ణా నదీ జలాల విషయం కేడబ్ల్యూడీటీ2 పరిధిలో ఉందన్నారు.
ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చేలా మరో ఏడాది పాటు తన నిర్ణయాన్ని సమర్పించే గడువును పొడిగించాలని ట్రిబ్యునల్ అభ్యర్థించినట్లు తెలిపారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని.. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్ 5లోని సబ్-సెక్షన్ (3) ప్రకారం, కేడబ్ల్యూడీటీ 2 నివేదిక నిర్ణయాన్ని సమర్పించే గడువును పొడగించినట్లు వివరించారు. ఆగస్టు 1, 2025 నుంచి జులై 31, 2026 వరకు పొడిగిస్తూ ఈ ఏడాది జులై 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాధానంలో పొందుపరిచారు.
