Kylian Mbappe: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సంచలనం, స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె (Kylian Mbappe) మైదానంలో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా స్వీడన్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి అదరగొట్టాడు. ఈ క్రమంలో ఏకంగా 88 ఏళ్లుగా చెక్కు చెదరని వరల్డ్ రికార్డును బద్దలు కొట్టి, క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాడు.
మెరిసిన ఎంబాపె:
మ్యాచ్ ఆరంభం నుంచే ఫ్రాన్స్ ఎటాకింగ్ గేమ్‌తో అవకాశాలు సృష్టించుకుంది. ఈ క్రమంలో 45వ నిమిషంలో మైఖేల్ ఒలిసి అందించిన షార్ట్ కార్నర్ పాస్‌ను ఉస్మాన్ డెంబెలె అందుకోగా, అతడి నుంచి బంతిని అందుకున్న ఎంబాపె డిఫెండర్లను ఏమార్చుతూ అద్భుతమైన కర్లర్‌తో తొలి గోల్ సాధించాడు. ఆ తర్వాత 74వ నిమిషంలో ఒలిసి ఇచ్చిన కిరాక్ పాస్‌ను సద్వినియోగం చేసుకుని మరోసారి గోల్ కొట్టి ఫ్రాన్స్‌కు 3-0 ఆధిక్యాన్ని అందించాడు.
నాకౌట్స్ కింగ్.. రికార్డుల మోత:
వరల్డ్ కప్ నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఎంబాపె సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. స్వీడన్‌పై చేసిన తొలి గోల్ అతని కెరీర్‌లో 9వ నాకౌట్ గోల్ కాగా, రెండో గోల్‌తో ఆ సంఖ్యను 10కి చేర్చాడు. దీంతో బ్రెజిల్ లెజెండ్స్ లియోనిడాస్, రొనాల్డో (ఇద్దరూ 8 గోల్స్) పేరిట ఉన్న గత రికార్డును అధిగమించాడు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లలో 10 గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఆల్ టైమ్ లిస్ట్‌లో.. మెస్సీకి దరిదాపుల్లో:
ఈ మ్యాచ్‌తో ఎంబాపె తన ఓవరాల్ వరల్డ్ కప్ గోల్స్ సంఖ్యను ఏకంగా 18కి పెంచుకున్నాడు. జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ (16 గోల్స్)ను వెనక్కి నెట్టి ఆల్ టైమ్ గోల్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (19 గోల్స్) మాత్రమే ఎంబాపె కంటే ముందున్నాడు. అలాగే, 2026 ఎడిషన్‌లో ఎర్లింగ్ హాలండ్‌ను దాటేసి, 6 గోల్స్‌తో మెస్సీతో పాటు జాయింట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ రారాజే:
నాకౌట్స్ మ్యాచ్‌లలో ఎంబాపె ట్రాక్ రికార్డ్ అద్భుతం. తన తొలి వరల్డ్ కప్ (2018) నాకౌట్స్‌లో అర్జెంటీనాపై రెండు గోల్స్ చేసిన ఎంబాపె.. ఫైనల్‌లో క్రొయేషియా పైనా గోల్ కొట్టి ఫ్రాన్స్‌కు కప్పు అందించాడు. ఇక 2022లో పోలాండ్‌పై రెండు గోల్స్, ఫైనల్లో అర్జెంటీనాపై ఏకంగా హ్యాట్రిక్ సాధించాడు. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో మొత్తం 4 గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్ అతనే. పీలే, వావా, పాల్ బ్రెట్నర్, జిదానె సరసన రెండు వేర్వేరు ఫైనల్స్‌లో గోల్స్ చేసిన ఎలైట్ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
అత్యధిక ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ గోల్స్ చేసిన ఆటగాళ్లు
ప్లేయర్ (దేశం) గోల్స్ సంవత్సరాలు
* కిలియన్ ఎంబాపె (ఫ్రాన్స్) 10 2018-2026
* లియోనిడాస్ (బ్రెజిల్) 8 1934-1938
* రొనాల్డో (బ్రెజిల్) 8 1998-2002
* జస్ట్ ఫోంటైన్ (ఫ్రాన్స్) 7 1958
* వావా (బ్రెజిల్) 7 1958-1962
* ఓల్డ్రిచ్ నెజెడ్లీ (చెకోస్లోవేకియా) 7 1934
* పీలే (బ్రెజిల్) 7 1958-1970
