కూలీలు ప్రచారానికి పోతున్రు .. కైకిలికి వస్తలేరు!

కూలీలు ప్రచారానికి పోతున్రు .. కైకిలికి వస్తలేరు!

కరీంనగర్, వెలుగు: ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది.. హుజురాబాద్ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి. నియోజకవర్గంలో ఎన్నికలు ఉండటంతో  వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదు. టౌన్లలో  బిల్డింగ్, ఇతరత్రా కూలి పనులకు మనుషులు దొరకడం లేదు.  ఎప్పుడూ రద్దీగా ఉండే  కూలీ అడ్డాలు బోసిపోతున్నాయి. ప్రతిరోజూ   ప్రచారాలు, సభలు నిర్వహిస్తుండటంతో  అడ్డా మీద, గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడుతోంది.  నిత్యం ఏదో ఒకచోట సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూలీలను తీసుకుపోతున్నారు. దీంతో గ్రామాల్లో  రైతులకు,  భవన నిర్మాణాలకు ఎవరూ దొరక్క ఇబ్బంది  పడుతున్నారు.

ఒక్కో ఊరు నుంచి 400 మంది..

గతంలో పార్టీల కార్యకర్తలు మాత్రమే ఎన్నికల ప్రచారాలలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. ఏదన్నా  మండల కేంద్రంలో మీటింగ్  జరుగుతుందంటే చాలు.. ఆ మండలంలో ఉన్న ఒక్కో ఊరు నుంచి సుమారు 400 మందికి పైగా జనాలను సభలకు తరలిస్తున్నారు. పార్టీలకు చెందిన కార్యకర్తలు మహా అయితే.. ఊరుకు 100 నుంచి 200 మంది వరకు ఉంటారు. కానీ తమ సంఖ్యాబలం ఎక్కువగా ఉందని చూపించుకోవడానికి లోకల్ లీడర్లు  నానా తంటాలు పడుతున్నారు. మందీ మార్బలం లేకుంటే జనాలు పట్టించుకోరని.. అందుకే  ప్రచారంలో, సభలలో మంది ఎక్కువగా ఉండేట్లు చూసుకుంటున్నారు. ఎక్కడ  కార్యక్రమం ఉంటే అక్కడికి స్థానికంగా ఉన్న లీడర్లు.. నాయకులతో మాట్లాడి ఎక్కువ మందిని తరలిస్తున్నారు. సభలకు అయితే ఫిక్స్ డ్ గా అమౌంట్​ఇస్తున్నారు. ప్రచారాలకు వెళ్లేవారు  కాస్త నడవాల్సి ఉంటుంది కాబట్టి వీరికి కూలి కొంచెం ఎక్కువ చెల్లిస్తున్నారు. మధ్యాహ్నం తినడానికి ఆహార పొట్లాలు ఇస్తున్నారు.  హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని  మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

కూలీ రేట్లు పెరిగినయ్ 

ఎన్నికల పోరుతో గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడుతోంది. దీంతో వ్యవసాయ పనులు కుంటుపడుతున్నాయి.  ఎక్కడ మీటింగ్ అయినా కూలీలనే తీసుకుపోతున్నారు. దీంతో వ్యవసాయ పనులకు ఎవరూ రావడం లేదు.  సాధారణంగా ఈ సీజన్ లో  వరిలో కలుపు తీయాల్సి ఉంటుంది.  ఎకరా పొలంలో 10 నుంచి 15 మంది కలుపు తీయాల్సి ఉండగా కూలీలు దొరకక పనులు ఆలస్యం అవుతున్నాయి.  కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయని రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఒక మహిళకి సాధారణంగా రూ. 250  కూలీ ఇస్తుండగా ఇప్పుడు  రూ. 350 చెల్లించాల్సి వస్తోంది. అయినా కూడా అవసరం ఉన్న మేరకు కూలీలు దొరకడం లేదు.  ఎకరం పొలానికి  కేవ‍లం 10 మంది మాత్రమే వస్తున్నారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యేది.. మరో రెండు రోజులు పడుతోందని రైతులు వాపోతున్నారు. 

ఇండ్ల పనులు ఆగుతున్నయ్ 

హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారాలు, సభలు  ప్రతి రోజు జరుగుతుండటంతో కూలీల కొరత ఏర్పడుతోంది. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో భవన నిర్మాణంతో పాటు.. ఇతర చిన్న చిన్న పనులకు కూలీలు దొరకడం లేదు. గతంలో అంతా లేబర్ అడ్డాల మీదనే ఉండేవారు. వీరిని రెగ్యులర్ గా తీసుకుపోయే మేస్త్రీలే ఇప్పుడు ఎక్కడ సభ ఉంటే అక్కడికి తీసుకుపోతున్నారు. కూలీ పనులకు వచ్చేవారినే కొంచెం మంచిగా రెడీ అయి రమ్మంటున్నారు.  ప్రతి రోజు కండువాలు వేసుకుని.. జెండాలు కప్పుకుని వారి వెంట తిరగడం,  మధ్యాహ్నం టైమ్ లో లంచ్, మగవారికి అయితే మద్యం కూడా సరఫరా చేస్తుండటంతో ఇతర పనులకు వెళ్లడానికి సుముఖత చూపడం లేదు. దీంతో భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.  చాలామంది నిర్మాణాలు పూర్తికాక గృహ ప్రవేశాలు వాయిదా వేసుకుంటున్నారు.