గీత కార్మిక సొసైటీల భూములను కాపాడాలి: కార్మిక సంఘం డిమాండ్

గీత కార్మిక సొసైటీల భూములను కాపాడాలి: కార్మిక సంఘం డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో కల్లు గీత కార్మిక సొసైటీలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం కాపాడాలని ఆ సంఘం నేతలు డిమాండ్ ​చేశారు. ఆ భూములపై రియల్టర్ల కన్ను పడి అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రభుత్వమే ఆ భూములకు కంచెలు ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా గీత కార్మికుల ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలనే జీవో నంబర్ 560ని కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ  తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్​లో మహాధర్నా చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆ సంఘంఅధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ 
గీతన్నల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. కానీ నేటికీ అమలుచేయలేదని విమర్శించారు. గీత కార్మికుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పి.. బడ్జెట్​లో రూ.30 కోట్లు మాత్రమే చూపించారని, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. సేఫ్టీ ప్రికాషన్స్ లేక కల్లు గీస్తున్న కార్మికుల బతుకులకు భరోసా లేకుండా పోయిందని, తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

హామీలను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. అనంతరం 18 డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. ధర్నాలో సంఘం ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.