- ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బడ్జెట్ విధాన రూపకల్పనలోనే సమన్వయలోపం ఉందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ విమర్శించారు. ఆదివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై ‘ఎక్స్’ లో జైరాం రమేశ్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ బడ్జెట్‌లో 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలును ఆర్థిక మంత్రి ప్రకటించనున్నారని తెలిపారు.
అయితే, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత ఉంటుందోనని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయని చెప్పారు. ‘బడ్జెట్ అంకెలను జీడీపీ శాతంలో చూపిస్తారు. అయితే, బడ్జెట్ ప్రవేశపెట్టిన 26 రోజుల తర్వాత... 2022/23 ఆధారిత కొత్త జీడీపీ సిరీస్‌ను విడుదల చేయనున్నారు. దీనివల్ల బడ్జెట్ గణాంకాలను మళ్లీ సవరిస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు.
అలాగే, ఫిబ్రవరి 12న కొత్త వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) విడుదల కానుందని, ఇందులో ఆహార ధరల వాటా తగ్గే అవకాశం ఉందని, ఇది బడ్జెట్ లెక్కలపై ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే కొత్త జీడీపీ, సీపీఐ గణాంకాలను విడుదల చేయడం చూస్తుంటే.. ప్రభుత్వ విభాగాల మధ్య విధానపరమైన సమన్వయం ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందని విమర్శలు గుప్పించారు.
