
- 12 ప్లాట్లకు గాను 2 ప్లాట్లకే బిడ్లు
- బాచుపల్లి వివరాలు చెప్పని ఆఫీసర్లు
- రెస్పాన్స్ లేనందునే గోప్యత
- పాటిస్తున్నారని అనుమానాలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: భూముల వేలం ద్వారా భారీ ఎత్తున ఆదాయం సమకూర్చుకోవచ్చని భావించిన హెచ్ఎండీఏకు నిరాశే ఎదురవుతోంది. గతంలో వేలం వేయగా మిగిలిన ప్లాట్లలో కొన్నింటిని వేలం వేయాలని నిర్ణయించి రెండు రోజులుగా ఈ–వేలం ద్వారా 103 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. అయితే మొదటిరోజైన బుధవారం అధికారులకు షాక్ తగిలింది. తుర్కయాంజాల్లో 12 పాట్లను వేలం వేయాలని నిర్ణయించి సర్కారు వారి పాటగా రూ.65వేలు నిర్ణయించారు. ఇందులో కేవలం రెండు ప్లాట్లకు మాత్రమే బిడ్లు వచ్చాయని, అదీ ఒక ప్లాటు గజానికి 70వేలు పలకగా, మరో ప్లాట్‌కు 1.10 లక్షలు పలికినట్టు సమాచారం.
దీంతో అధికారులు వేలం పాటలపై సమాచారం బయటకు రానివ్వడం లేదు. 12 పాట్ల సైజులు సరిగ్గా లేక పోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మూలలు సమంగా లేకపోవడం, ప్లాటు సైజులు హెచ్చుతగ్గులు ఉండడాన్ని మరో కారణంగా చెప్తున్నారు. రియల్ ఎస్టేట్‌రంగంలో ప్రస్తుతం నెలకొన్న స్తబ్ధత, సర్కారు పాట ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఎవరూ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం తుర్కయంజాల్వైపు అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని, మార్కెట్లో చదరపు గజానికి రూ.45వేల నుంచి రూ.50వేలు పలుకుతుంటే..హెచ్ఎండిఏ ప్రారంభ ధర రూ. 65వేలు పెట్టడంపై పెదవి విరుస్తున్నారు. అందుకే ప్లాట్ల కొనుగోలుకు పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది.
అధికారుల సైలెన్స్ ఎందుకు?
మొదటి రోజు ఆశించిన విధంగా వేలం సాగకపోవడంతో హెచ్ఎండీఏ అధికారులు గురువారం బాచుపల్లిలో 70 ప్లాట్ల వేలం పైనే ఆశలు పెట్టుకున్నారు. బాచుపల్లి ఇటీవల భారీఎత్తున డెవలప్అయ్యింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే హైటెక్‌సిటీ ఉంది. అనేక ఐటీ కంపెనీలు, వివిధ ఎంఎన్‌సీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు, విల్లాలు, మాల్స్వెలిశాయి. దీంతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్పెరిగింది. అయితే, గురువారం బాచుపల్లిలో 70 ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించలేదు. తుర్కయాంజాల్మాదిరిగానే బాచుపల్లిలో కూడా వేలం పాటకు స్పందన కరువైనందునే వివరాలు చెప్పడం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతమెంతో ఘనం
నిజానికి హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం ఎప్పుడు జరుగుతుందా? అని చాలా మంది ఎదురుచూసిన రోజులున్నాయి. క్లియర్ టైటిల్, రూల్స్ప్రకారం లేఅవుట్లను వేసి ఏరకమైన చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ప్లాట్లను అమ్ముతుందన్న మంచి పేరు హెచ్ఎండీఏకు ఉంది. కోకాపేట, బుద్వేల్, కీసర, బాట సింగారం, ప్రతాప సింగారం, ఉప్పల్భగాయత్వంటి లేఔఅవుట్లలో ప్లాట్లను ఎగబడి మరీ కొన్నారు. కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం 103 ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయని భావించినా కథ అడ్డం తిరిగింది.