సినిమాల్లో ఛాన్స్​లు ఇప్పిస్తానని మోసం..

సినిమాల్లో ఛాన్స్​లు ఇప్పిస్తానని మోసం..

జూబ్లీహిల్స్, వెలుగు: సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడితో పాటు బెదిరింపులకు పాల్పడిన అతడి ప్రియురాలిపై మధురానగర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ యువతి మేకప్ ఆర్టిస్టుగా సిటీలో పనిచేస్తూ రహమత్​నగర్​లో ఉంటోంది. గతేడాది వినుకొండకు ఆమె బస్సులో వెళ్తుండగా.. అదే బస్సులో ఉన్న జొన్నలగడ్డ రాజుతో పరిచయమైంది.

తను జూనియర్ ఆర్టిస్ట్ ను అంటూ రాజు ఆమెతో చెప్పాడు. సినిమా ఇండస్ట్రీలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని , చాన్స్ ఇప్పిస్తానంటూ ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత ఇద్దరు సిటీకి వచ్చారు. అనంతరం రాజు ఆ యువతిని శారీరకంగా లొంగదీసుకుని, రూ. 50 వేలు డబ్బు తీసుకున్నాడు. కొద్దిరోజుల కిందట భాను అనే మహిళ సదరు యువతికి ఫోన్ చేసింది. నా భర్త రాజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించి బెదిరించింది.  నీతో మాట్లాడాలంటూ..సికింద్రాబాద్ రావాలని చెప్పింది. అక్కడికి వెళ్లిన యువతి ఫొటోలు, ఆధార్ కార్డును భాను తీసుకుంది. ఎవరికైనా చెప్పావంటే చంపేస్తామని భానుతో పాటు రాజు ఆమెను బెదిరించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి మధురానగర్ పీఎస్​లో కంప్లయింట్ చేయగా.. పోలీసులు కేసు ఫైల్ చేశారు.