సింగరేణిలో లేడీ గార్డులు.. యువతులకు సెక్యూరిటీ బాధ్యతలు

 సింగరేణిలో లేడీ గార్డులు.. యువతులకు సెక్యూరిటీ బాధ్యతలు
  • మహిళా ఉద్యోగులు పెరుగుతున్నందున 
  • పూర్తి హోదాతో నియమించేందుకు కసరత్తు
  • ఇంటర్నల్​ నోటిఫికేషన్​ జారీ చేసేందుకు సన్నాహాలు

కోల్​బెల్డ్​, వెలుగు: సింగరేణిలో మహిళా సాధికారత దిశగా మరో ముందడుగు పడుతోంది. సంస్థలో మహిళా సెక్యూరిటీ గార్డుల నియామకానికి యాజమాన్యం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా 2,146 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో 204 మంది అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు సెక్యూరిటీ విభాగంలో పూర్తిగా పురుషులే సేవలందించగా, ఇకపై మహిళలను కూడా నియమించనున్నారు. సంస్థలో పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల ద్వారా కూడా భద్రతా సేవలు కొనసాగుతున్నాయి. మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి కొత్త అవకాశాలు కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలో మహిళలను పూర్తి హోదాతో సెక్యూరిటీ గార్డులుగా నియమించి, సంస్థకు చెందిన వేల కోట్ల ఆస్తుల పరిరక్షణలో భాగస్వాములను చేయనున్నారు. 

పూర్తి హోదాతో.. 

సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా చేరిన సుమారు 1,942 మంది జనరల్ అసిస్టెంట్లు ప్రస్తుతం వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. చదువుతో సంబంధం లేకుండా వర్క్‌‌షాప్‌‌లు, జీఎం ఆఫీసులు, అండర్‌‌గ్రౌండ్ మైన్లు, స్టోర్స్, ఇతర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ, యంత్రాల మరమ్మతులు, వైండింగ్ వంటి పనుల్లో శిక్షణ పొందుతున్నారు. గతంలో ప్రతి ఏరియాలో కొద్దిమంది మహిళలు సెక్యూరిటీ విభాగంలో పనిచేసినా, రిటైర్మెంట్ల తర్వాత కొత్త నియామకాలు జరగలేదు. అయితే ప్రస్తుతం మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో సుమారు 150 మంది మహిళా ఉద్యోగులను సెక్యూరిటీ గార్డులుగా నియమించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఏరియా వారీగా ఖాళీలను బట్టి నియామకాలు చేపడతారు. త్వరలోనే ఇంటర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఇప్పటి వరకు మజ్దూర్ స్థాయిలో బాధ్యతలు ఇచ్చిన మహిళలకు, ఇక పూర్తి హోదాతో సెక్యూరిటీ గార్డులుగా అవకాశాలు కల్పించనున్నారు. ముఖ్యంగా యువతులకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ పోస్టుల కోసం ఫిజికల్ ఫిట్‌‌నెస్ పరీక్షతో పాటు రాత పరీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది. గనుల్లో ఉన్న విలువైన యంత్రాలు, విడి భాగాలు, ఇతర ఆస్తుల భద్రత కోసం మహిళా గార్డులను వినియోగించనున్నారు. అలాగే ఏరియా హాస్పిటల్స్​, ఆఫీసుల వద్ద కూడా భద్రతా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 

పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం..

సింగరేణిలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు అండర్‌‌గ్రౌండ్ బొగ్గు గనుల్లో మహిళలకు అవకాశాలు లేకపోగా, సర్ఫేస్ పనుల్లో కూడా పరిమిత స్థాయిలోనే వారు పనిచేసేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. ఇటీవలి కాలంలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరిగి ప్రస్తుతం 2,146 మందికి చేరింది. ఫీమేల్ మజ్దూర్ల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు మహిళలే గనుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకుంది. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వంటి విభాగాల్లో ఇంజినీర్లుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రిషియన్లు, ఫిట్టర్లు, ఫోర్‌‌మెన్లుగా కూడా అండర్‌‌గ్రౌండ్ గనుల్లో సేవలందిస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలు ఓపెన్‌‌కాస్ట్ ప్రాజెక్టుల్లో ఈపీ ఆపరేటర్లుగా విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విపత్తుల సమయంలో స్పందించేందుకు ప్రత్యేకంగా మహిళా రెస్క్యూ టీంను కూడా ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం ఎంపిక చేసిన గనుల్లో 122 మంది మహిళలు అండర్‌‌గ్రౌండ్‌‌లో పనిచేస్తుండగా, వారిలో 40 మంది అధికారులు కూడా ఉన్నారు.