
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ పేరును సొంత చేసుకున్న ఏకైక నటి నయనతార. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 23 ఏండ్లు పూర్తయింది. కేవలం గ్లామర్‌తో కాకుండా, తన బలమైన నటన, వైవిధ్యమైన పాత్రలు, సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోయగలిగే సత్తాతో ఆమె ఈ అరుదైన గుర్తింపును సాధించుకున్నారు. లేటెస్ట్ గా నయనతార తన సినీ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఎమోషనల్ పోస్ట్..
తన సినీ ప్రయాణంలో 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. నయనతార సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ను అభిమానులతో పంచుకుంది. మొదట్లో ఒక్క సినిమా చేద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా నా జీవితంలో ఇంత ముఖ్యమైన ప్రపంచం అవుతుందని అస్సలు అనుకోలేదు. కానీ, కెమెరా ముందు నిలబడిన తర్వాత.. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నన్ను పూర్తిగా మార్చేశాయి. అవి నాకు ధైర్యాన్ని ఇచ్చాయి, నన్ను నేనుగా మలిచి, ఈ స్థానాన్ని కలిగించాయి. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలచిన ప్రతి ఒక్కరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని పేర్కొన్నారు.
నయనతార ప్రయాణం నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేస్తున్న ఆమెను, మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ గుర్తించి 2003లో ‘మనస్సినక్కరే’ (Manassinakkare) చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఒక్క సినిమాలో నటించాలని కెరీర్ ప్రారంభించిన ఆమెకు ఆ తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి, రజినీకాంత్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో వెనక్కి తిరిగి చూడలేదు.
కెరీర్‌లో బిజీ..
‘చంద్రముఖి’, ‘శ్రీరామ రాజ్యం’ (సీత పాత్ర), ‘అరమ్’, ‘మాయ’, ‘కోలమావు కోకిల’ వంటి చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు నయనతారలోని అసాధారణ నటిని ప్రపంచానికి పరిచయం చేశాయి. ముఖ్యంగా, షారుఖ్ ఖాన్ సరసన నటించిన ‘జవాన్’ ఆమెను బాలీవుడ్‌కు కూడా పరిచయం చేసింది.
వ్యక్తిగత జీవితంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకున్న నయన్.. వీరికి ఉయిర్, ఉలగ్ అనే కవల కుమారులు ఉన్నారు. వృత్తిపరంగా ఆమె చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ షూటింగ్‌లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన "మన శంకర వర ప్రసాద్ గారు" నటిస్తోంది. అలాగే, కన్నడలో యశ్ హీరోగా వస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’లో నటించనున్నారు. అంతేకాకుండా, కవిన్ సరసన విష్ణు ఎడవన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు ‘హి’ (Hi) అనే టైటిల్ ఖరారు చేసి, పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. 23 ఏళ్లుగా తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటూ, ఇప్పటికీ వరుస ప్రాజెక్టులతో నయన్ దూసుకుపోతున్నారు..