
వీరికి దొంగతనాలు అంటే వెన్నతో పెట్టిన విద్య.. వీరు షాపులో ఉంటే బంగారు నగలు ఇట్టే మాయమవుతాయి.. పండుగలు, రద్దీగా ఉండే సమయాలే వీళ్ల టార్గెట్.. కన్నార్పేలోపే బంగారాన్ని మాయం చేసేస్తారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హబ్సిగూడలోని నవకర్ గోల్డ్ షాపులో ఈ నెల(జనవరి) 5వ తేదీన ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం కొంటామంటూ మాయమాటలు చెప్పి.. దుకాణంలో చోరీ చేశారు. సాయంత్రం షాపు రద్దీగా ఉన్న సమయంలో షాపులోకి వచ్చి.. బంగారు కమ్మలు కొంటామని మోడల్స్ చూపించమని షాపు సిబ్బందిని బురిడీ కొట్టించారు. కమ్మలను సెలక్ట్ చేసే క్రమంలో బంగారు కమ్మలు ఉన్న ప్లేస్ లో నకిలీ కమ్మలు పెట్టి.. అసలు కమ్మలను ఎత్తుకెళ్లారు.
సిబ్బందికి వారిపై అనుమానం వచ్చి వెంటనే సీసీ టీవీ పుటేజీని పరిశీలించగా.. బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. 20 గ్రాముల బంగారు కమ్మలను ఎత్తుకెళ్లినట్లు షాపు యజమాని తెలిపారు.
ఈ ఘటనపై షాపు యజమాని ఓయూ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గోల్డ్ షాపుకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి దొంగలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.