మూడు నెలలు మంచి ముహూర్తాలున్నయి

మూడు నెలలు మంచి ముహూర్తాలున్నయి
  • కరోనా భయం తగ్గడంతో ఫంక్షన్ల హడావుడి
  • పురోహితులు, ఈవెంట్​ ఆర్గనైజర్లు బిజీబిజీ
  • కిటకిటలాడుతున్న షాపింగ్ ​మాల్స్, గోల్డ్​ షాప్స్ 
  • మండుతున్న ధరలతో భారీగా పెరిగిన పెళ్లి ఖర్చు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లగ్గాల సీజన్​ స్టార్ట్ అయింది. ఈ నెల నుంచి జూన్ 23 వరకు తెలంగాణ, ఏపీలో మూడు లక్షలకుపైగా పెండ్లిండ్లు జరగనున్నాయి. మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో లక్షల జంటలు ఒక్కటి కానున్నాయి. రెండేండ్ల నుంచి కరోనాతో వాయిదా పడ్డ పెండ్లిండ్లు ఇప్పుడు షురు అవుతున్నాయి. కరోనా భయం తగ్గడంతో సిటీలు, ఊర్లల్లో ఎక్కడ చూసిన ఫంక్షన్ల హడావుడి కనిపిస్తోంది. వరుస పెండ్లిండ్లతో రాష్ట్రంలో వందల కోట్ల బిజినెస్ జరగనుంది. 

ఫంక్షన్ హాళ్లు, మేళం, డెకరేషన్, పూలుపండ్లు, పిండి వంటలు, ఫుడ్, ఈవెంట్ ఆర్గనైజర్స్, ఫొటోగ్రాఫర్లు, పూజారులు, ట్రావెల్స్, టెంట్ హౌస్ లు, గోల్డ్, బట్టల షాపులు ఇలా అన్ని వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే ఫంక్షన్ హాళ్లు దాదాపుగా బుక్ అయిపోయాయి. పెళ్లిళ్లతో వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

రెండేండ్లుగా పెళ్లిళ్లు తక్కువే

కరోనా కారణంగా రెండేండ్ల నుంచి చాలా వరకు పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. విదేశాల్లో ఉన్న యువతీయువకులు కరోనా ఆంక్షలు, ఫ్లైట్స్ లేకపోవటంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే వీరంతా స్వదేశానికి వస్తున్నారు. మూడు నెలలు ముహూర్తాలు ఉండటంతో ఇక్కడ పెండ్లిండ్లు చేసుకుని తిరిగి విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్​ చేసుకుంటున్నారు.

మండుతున్న ధరలు

రెండేండ్ల నుంచి పెళ్లిళ్లు లేకపోవటంతో అన్ని వ్యాపారాలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కావటంతో ఆ నష్టాలను భర్తీ చేసుకునేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వివిధ కారణాల వల్ల అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరుగుతుండటంతో వీటి ప్రభావంతో మిగతా అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. ధరల మంటతో గతంతో పోలిస్తే ఇప్పుడు పెళ్లిళ్ల కోసం ఖర్చు భారీగా పెరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలలు మంచి ముహూర్తాలున్నయి

వచ్చే మూడు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నయి. లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయి.  వచ్చే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 3 రోజులు మినహా ముహూర్తాలు లేవు. జులైలో ఆషాడమాసం రావడం, దసరా టైమ్​లో, కార్తీక మాసంలో మూఢాలు ఉన్నందున ముహూర్తాలు లేవు. ఈ ఏప్రిల్​ 13 నుంచే పెళ్లిళ్లు స్టార్ట్ అయినయి. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు తీరిక లేకుండా ఉన్నం.
- బాలాజీ, పురోహితుడు, ఖమ్మం

ఆర్డర్లు ఎక్కువ వస్తున్నయి

పెళ్లిళ్లు స్టార్ట్ కావటంతో ఆర్డర్లు ఫుల్​గా వస్తున్నయి. ఇప్పటికే చాలా పెళ్లిళ్లకు ఆడ్వాన్స్ లు తీసుకున్నం. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి పెళ్లి, రిసెప్షన్, పెళ్లి కూతురు ఫంక్షన్లకు లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు ప్యాకేజీగా తీసుకుంటున్నం. ఇప్పటి వరకు 15 ఆర్డర్స్ వచ్చాయి. సిటీ బయట, గ్రామాల్లోని మంచి లొకేషన్లలో ప్రీ వెడ్డింగ్ షూట్లకు వెళ్తున్నం. ఈ షూట్ల కోసం 10 మంది పనిచేస్తున్నరు.
- గణేశ్​ రెడ్డి, గణేశ్​  స్టూడియో, హైదరాబాద్ 

జూన్​లో పెళ్లి పెట్టుకున్నం

మా అమ్మాయికి రెండేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నం. ఈ మధ్యే పెళ్లి కుదిరింది. జూన్ లో ముహూర్తం పెట్టుకున్నం. ఫంక్షన్ హాల్​ గత నెలలోనే బుక్ చేసినం. వంట నూనెలు మొదలుకుని గోల్డ్  వరకూ అన్ని వస్తువుల ధరలూ మండిపోతున్నయి.
- కవిత, వరంగల్