
హైదరాబాద్, సెప్టెంబర్ 26: ప్రపంచానికి క్రియాయోగాన్ని పరిచయం చేసిన యోగావతార్ లాహిరీ మహాశయుల జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన ఆశ్రమాలు, ధ్యానకేంద్రాల్లో భక్తులు, క్రియాయోగులు ప్రత్యేక ధ్యానసెషన్లు నిర్వహించి మహాశయుల సేవలను స్మరించారు.
1828, సెప్టెంబర్ 30న జన్మించిన లహరీ మహాశయులు.. సన్యాసీ లేదా ఏకాంతవాసీ కాదు. భార్య, పిల్లలతో ఒక సాధారణ జీవితాన్ని గడిపిన ఒక గృహస్థుడు, ప్రభుత్వ అకౌంటెంట్. 1861లో, రాణీఖేత్ సమీపంలో ఉన్నప్పుడు, అమర యోగి మహావతార్ బాబాజీచే ఆకర్షితులై, హిమాలయాలకు వెళ్లి, అంతరించిపోయిన క్రియాయోగ విద్యలో దీక్ష పొందారు.
వారణాసికి తిరిగి వచ్చిన తర్వాత క్రియాయోగం బోధించడం ప్రారంభించారు. కుల భేదాలను, మత సిద్ధాంతాలను ఛేదించిన ఆయన.. దేవుడు అందరివాడు అనే సందేశాన్ని ప్రాచారం చేశారు. నిలకడైన, నిజాయితీతో కూడిన సాధన ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుందని ఆయన శిశ్యులకు ఉపదేశం చేశారు. "బనత్ బనత్ బన్ జాయ్" అనే ఆయన ప్రసిద్ధ ఉపదేశం.. శ్రమతో దివ్యలక్ష్యాన్ని సాధించవచ్చన్న సందేశం.. ఈ సందర్భంగా భక్తుల గుండెల్లో మార్మోగుతోంది.
లహరీ మహశయుల గురించి భక్తులు చెప్పే మహిమలలో పరమహంస యోగానందం గురించి చెప్పిన ప్రవచనం ముఖ్యమైనది. పరమహంస యోగానంద గొప్ప యోగి అవుతారని ఆయన తల్లికి చెప్పారట. ఆ ప్రవచనం నిజమై.. యోగానందజీ ప్రపంచంలోనే గొప్ప క్రియాయోగ సాధకులయ్యారు. లాస్ ఏంజిలిస్ లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్ ఆర్ ఎఫ్)ను, రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను స్థాపించారు. ఈ సంస్థలు యోగావతారుల పరంపరలో, యోగానంద తన దివ్యగురువు పాదాల వద్ద నేర్చుకున్న బోధనలను ప్రచారం చేస్తాయి.
మరింత సమాచారం: www.yssofindia.org