ఘనంగా లాహిరి మహాశయుల జయంతి వేడుకలు

ఘనంగా లాహిరి మహాశయుల జయంతి వేడుకలు

యోగావతార్ లాహిరీ మహాశయుల 195వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ బేగంపేట్ వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో కన్నుల పండువగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యోగావతారులుగా అందరం ప్రేమతో గౌరవించే ప్రఖ్యాత ఋషి పుంగవులు, లాహిరీ మహాశయులు ఈ ప్రపంచానికి శాశ్వత వారసత్వంగా.. మోక్ష సాధన కోసం దైవం నిర్దేశించిన క్రియాయోగ ప్రక్రియను అందించారు. ప్రాపంచికతకు విరుద్ధంగాను, దైవ కేంద్రితంగా ఉండే భారతీయ ఆధ్యాత్మిక జీవనాదర్శానికి సాక్షీభూతంగా ఒక ఆదర్శప్రాయుడైన గృహస్థ యోగిగా ఆయన జీవితాన్ని గడిపారు.

అకౌంటెంట్ గా సాధారణ జీవనం

ఈ మహా గురువు బెంగాల్ లోని ఘుర్ణీలో ఒక సదాచార కుటుంబంలో.. శ్యామా చరణ్ లాహిరీగా జన్మించారు. పవిత్ర కాశీ నగరంలో ఆయన ఒక అకౌంటెంట్ గా.. అతి సాధారణంగా జీవిస్తూ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు. 1861లో 33 ఏళ్ల వయసులో.. ఆయన రాణీఖేత్ కొండల్లో మరణం లేని బాబాజీని మొదటి సారి కలుసుకున్నారు. అది గురు శిష్యుల మధ్య ఉండే శాశ్వతమైన బంధాన్ని తిరిగి ప్రేరేపించిన సంఘటన. బాబాజీ శ్యామా చరణునికి వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన, తరువాతి కాలంలో పతంజలికి, క్రీస్తుకు తెలిసిన సనాతన విముక్తిదాయక ప్రక్రియ అయిన.. పవిత్ర క్రియాయోగాన్ని ఉపదేశించి, నిజాయితీ కలిగిన అన్వేషకులందరికీ దాన్ని ప్రసాదించమని ప్రపంచంలోకి ఆయనను పంపించారు. అప్పటి నుంచి క్రియాయోగమనే ఆ దివ్య నదీ జలాలు.. కాశీలోని ఒక మారుమూల ప్రదేశం నుంచి భారతదేశపు సుదూర ప్రాంతాలకు ప్రవహించడం మొదలైంది. లాహిరీ మహాశయుల క్రియాయోగ సందేశం అందరినీ అక్కున చేర్చుకునే.. తన లక్షణం వల్ల కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా విస్తృతంగా వ్యాప్తి చెందింది. క్రియాయోగం శ్వాస, మనస్సు, ప్రాణశక్తి కలిసి పని చేసే ఒక విధమైన ప్రాణాయామం. దీనిలో ప్రాణశక్తి వెనుబాములోని శక్తి కేంద్రాలను మేలుకొలిపి, లోపల ఉన్న ఈశ్వరుడి ఉనికిని గ్రహింపచేసేలా పైకీ, కిందకూ ప్రసరిస్తూ ఆధ్యాత్మిక ప్రగతిని వేగిరపరుస్తుంది.

దేశమంతటా  200కు పైగా ధ్యాన కేంద్రాలు

లాహిరీ మహాశయులు 1886లో పదవీ విరమణ చేశాక తన ఇల్లు వదిలి ఎప్పుడో కానీ బయటకు వచ్చేవారు కాదు. ఈ మహనీయుడు తరచూ పద్మాసనంలో శ్వాసరహిత, నిద్రారహిత స్థితిలోనూ, నాడీ స్పందన, హృదయ స్పందన లేకుండానూ, బ్రహ్మానంద స్థితిలో, శాంతిని ప్రసరింపచేస్తూ భక్తులకు దర్శనమిచ్చేవారు. ఆయన శిష్యుల్లో అధికారులు, పండితులు, శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి వంటి గొప్ప ఋషులు ఉన్నారు. 1946లో ప్రచురితమైన యోగానందగారు తమ ‘ఒక యోగి ఆత్మకథ’ లో యోగావతారులు తన భవిష్యద్దర్శనంలో చెప్పిన విధంగానే లాహిరీ మహాశయుల జీవిత వృత్తాంతాన్ని వ్రాశారు. యోగానందగారు 1917లో క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేయాలన్న ఆశయంతో రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ప్రస్తుతం దీనికి భారతదేశమంతటా కలిపి 200కు పైగా ధ్యాన కేంద్రాలు, మండళ్ళు , నాలుగు ఆశ్రమాలు, అనేక రిట్రీట్ కేంద్రాలు ఉన్నాయి.

కాశీలో మహాసమాధి 

లాహిరీ మహాశయులు సెప్టెంబర్ 26, 1895లో కాశీలో మహాసమాధి చెందారు. జ్ఞానసిద్ధిని పొందిన మహాత్ములు తమ సంకల్పానుసారం శరీరాన్ని వదలి ఉన్నత చైతన్య స్థితులకు ఆరోహించాలని నిర్ణయించుకోగలరు. శరీరానికి బందీవై ఉండడం మానెయ్యి.. క్రియాయోగమనే రహస్య కీలకాన్ని ఉపయోగించి, శరీరం నుంచి తప్పించుకుని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో.. అని ఆయన ప్రబోధించేవారు. లాహిరీ మహాశయులు క్రియాయోగాన్ని పునరుద్ధరించడం వల్ల క్రియ ఈ భూమండలాన్ని చుట్టుముట్టి అన్వేషకులు తమలోనే దైవత్వాన్ని కనుగొని తాము కోల్పోయిన ఆత్మచైతన్యమనే స్వర్గాన్ని తిరిగి సాధించడానికి ఉపకరిస్తోంది.