నా బిడ్డకు శాపంగా ట్రంప్ నిబంధనలు..ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ రోహిణి తల్లి ఆవేదన

నా బిడ్డకు శాపంగా ట్రంప్ నిబంధనలు..ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ రోహిణి తల్లి ఆవేదన
  • ఆమె అమెరికా కల అందుకే ఆగిపోయింది
  • అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా  ఉంటున్న ఇండియన్లపై ఎందుకీ వివక్ష

పద్మారావునగర్, వెలుగు:‘అమెరికాలో రెసిడెన్సీ చేయాలనేది నా బిడ్డ కల.. అందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదేండ్లు శ్రమించింది. ఎన్నో పరీక్షలు రాసింది, విదేశాల్లో అబ్జర్వేషన్‌ షిప్స్ చేసింది.. చివరకు ఒక అమెరికన్ కాలేజీలో సీటు కూడా దక్కించుకుంది. అయితే 3 నెలల క్రితం జే-1 వీసా రిజెక్ట్ కావడంతో అలసి.. సొలసి జీవితాన్ని అంతం చేసుకుంది’ అని మూడు రోజుల కింద ఆత్మహత్య చేసుకున్న డాక్టర్​రోహిణి తల్లి లక్ష్మీరాజు ఆవేదన వ్యక్తం చేసింది. 

అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనే ఆశతో ఉన్న డాక్టర్​రోహిణి అది ఫలించక పద్మారావునగkHలోని తన ఫ్లాట్​లో ఈ నెల 21న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆమె తల్లి స్పందించారు. శుక్రవారం రాత్రి పోలీసులు తన బిడ్డ డెడ్​బాడీ పక్కన ఓ లెటర్​గుర్తించారని, అందులో ‘వీసా కోసం ఎంత గానో ప్రయత్నించాను.. ఇక శక్తి లేదు’ అని రాసి ఉందన్నారు. 

‘నా  బిడ్డ ఎంత వేదనను అనుభవించి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉంటుందో కదా..ఇలాంటి  పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు ’ అని అన్నారు. ‘పదేండ్ల కష్టం, వారాల కొద్దీ నిరీక్షణ, విదేశీ చదువులు, పరీక్షలు.. అన్నీ దాటిన నా బిడ్డ ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది.. జీవితాన్ని అంతం చేసుకుంది.. దీంతో నా కలలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి’ అని కన్నీరుమున్నీరుగా విలపించింది లక్ష్మీరాజు. ‘నా కొడుకు కూడా డాక్టరే.. వాడు ఇక అమెరికా మాట అనకూడదు. ఇక్కడే ఉంటే మంచిది’ అని ఆమె అన్నారు. 

‘ఇండియన్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. మరి వాళ్లు (ట్రంప్​విధానాలు) అమెరికాకు రానివ్వకుండా ఇండియన్స్​ కు ఎందుకు తలుపులు మూసేస్తున్నట్టు ’ అని ప్రశ్నించారు.  

అన్నీ తానై పెంచిన తల్లి..

రోహిణి ఆరేండ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయింది. అప్పటి నుంచి తల్లి లక్ష్మీరాజు తన ముగ్గురు పిల్లలను ఒంటరిగానే కష్టపడి  పెంచింది. కొడుకుతో పాటు రోహిణిని కూడా డాక్టర్​చదివించింది. కజకిస్తాన్​లో ఎంబీబీఎస్ చేయించింది.  అమెరికాలో క్లినిక్ పెట్టాలనే బిడ్డ కలకు మద్దతుగా నిలిచింది. 

ఎంబీబీఎస్​తర్వాత హైదరాబాద్​వచ్చిన రోహిణి ఎనిమిదేండ్లుగా ఇక్కడే ఉంటూ యూఎస్​ఎంఎల్ఈ పరీక్షలు రాసింది. అమెరికాలో అబ్జర్వేషన్‌షిప్స్ పూర్తి చేసి, రెసిడెన్సీ మ్యాచ్ కూడా అయ్యింది.  కానీ, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చిన కఠిన నిబంధనలు రోహిణి లక్ష్యానికి అడ్డంకిగా మారాయి. 

35 ఏండ్లు దాటిన పెండ్లి కాని భారతీయ డాక్టర్లకు 214(b) కింద వీసా రిజెక్షన్లు పెరగడంతో ఆమెకు జే-1 వీసా రాలేదు. పెండ్లి ప్రయత్నాలు చేస్తే అవి కూడా ఫలించలేదు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైంది. భోజనం చేయడం మానుకుంది. బయటికి రావడం తగ్గించింది. చివరకు జీవితాన్ని అంతం చేసుకోవాలని 21న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి ఆశలను వమ్ము చేసింది.