సిడ్నీ: ఇండియా స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఈ సీజన్‌లో ఎట్టకేలకు తొలి టైటిల్ సాధించాడు. ఆదివారం ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో మెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఏడోసీడ్ లక్ష్యసేన్ 21–15, 21–11తో యుషి తనకా (జపాన్)పై గెలిచాడు. ఆయుష్ షెట్టి తర్వాత ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గిన రెండో ఇండియన్ ప్లేయర్ లక్ష్యసేన్. 38 నిమిషాల మ్యాచ్‌లో లక్ష్య నియంత్రణతో కూడిన షాట్లతో పాటు మంచి ప్లేస్‌మెంట్, క్లీన్ ఎగ్జిక్యూషన్‌తో ఆకట్టుకున్నాడు.
ఇండియన్ ప్లేయర్ 6–3తో తొలి గేమ్‌ను మొదలుపెట్టగా, తనకా పదేపదే నెట్‌కు కొట్టి ఎర్రర్స్ చేశాడు. ఓ దశలో 35 షాట్ల ర్యాలీ జపాన్ షట్లర్ నెట్‌కు కొట్టడంతో ముగిసింది. ఇక్కడి నుంచి క్రాస్ కోర్టు విన్నర్లతో విజృంభించిన లక్ష్య 13–9, 17–13తో వెనుదిరిగి చూసుకోలేదు. రెండో గేమ్‌లో లక్ష్య ఆధిపత్యమే నడిచింది. 8–4, 10–5, 13–6, 17–8, 19–8తో దూసుకెళ్లాడు. దాంతో తనక కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు.
